indira gandhi assasiantion
-
కెనడాలో ఇందిరా గాంధీకి ఘోర అవమానం!
కెనడా: కెనడాలో ఆపరేషన్ బ్లూస్టార్ 39 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఖలిస్థాన్ మద్దతుదారులు నిర్వహించిన పెరేడ్లో భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని రిక్రియేట్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. దీన్ని హేయమైన చర్యగా అభివర్ణిస్తూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వెంటనే దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్, మిలింద్ దేవర. శకటంపై ప్రదర్శన... ఆపరేషన్ బ్లూస్టార్ పేరిట 1984లో ఆనాటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఆదేశాల మేరకు జూన్ 6న భారత సైనిక బలగాలు స్వర్ణదేవాలయంలోకి ప్రవేశించాయి. దానికి ప్రతిగా అదే ఏడాది అక్టోబర్ 31న ఇందిరా గాంధీని ఆమె భద్రతా సిబ్బంది అత్యంత కిరాతకంగా కాల్పులు చేసి హతమార్చారు. ఇది జరిగి 39 ఏళ్ళు పూర్తైన నేపథ్యంలో కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఖలిస్థాన్ మద్దతుదారులు 5 కి.మీ మేర పెరేడ్ నిర్వహించారు. ఆ సంఘటనను కళ్ళకు కడుతూ శకటంపై ఆనాడు భారత ప్రధానిని ఏ విధంగా చంపారో బొమ్మలతో సహా ప్రదర్శించారు నిర్వాహకులు. శకటం మీద శ్రీ దర్బార్ సాహిబ్ హత్యకు ప్రతీకారంగానే ఆమె హత్య జరిగినట్లు ఒక సందేశాన్ని కూడా ఉంచారు పెరేడ్ నిర్వాహకులు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఇది అవమానించడమే... ఇదే వీడియోని జత చేసి మిలింద్ దేవర ట్విట్టర్లో స్పందిస్తూ... కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఇందిరా గాంధీ హత్యను సంబరంగా చేసుకుంటూ 5 కి.మీ మేర పెరేడ్ నిర్వహించారని తెలిసి దిగ్భ్రాంతి చెందాను. ఒకరి పక్షాన ఉండటం కాదుగాని ఒక దేశ చరిత్రకు ఆ మరణం వలన ఆ దేశానికి కలిగిన బాధను గౌరవించాలి. ఈ చర్యను అందరూ ఖండించాలన్నారు. విదేశాంగ శాఖ మంత్రి నిద్రపోతున్నారా? ఈ ట్వీట్ కు స్పందిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని సంబరంగా చేసుకుంటుంటే చోద్యం చూస్తున్నారా? వెంటనే విదేశాంగమంత్రి జైశంకర్ దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై కెనడియన్ హై కమీషనర్ కామెరూన్ మేక్ కే కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ఆత్మహత్యే శరణ్యం.. కెనడాలో భారత విద్యార్థుల ఆవేదన -
ఆలోచనను శిక్షించడం సమంజసమా ?
రాజ్యం తమకు వ్యతిరేకమైన ఆలోచన చేసేవారిని శిక్షించడం లేదా ఆలోచన మారే విధంగా శిక్షణ ఇవ్వడం ఈ రోజు జరుగుతున్న కొత్త పరిణామం. రాజ్యం లక్ష్యాలు, మనుగడ, కొనసాగింపు నిరాటంకంగా ఉండాలంటే దానికి అడ్డుగా వున్న వ్యక్తులనైనా, వ్యవస్థలనైనా సంస్కరించే ప్రయత్నం చేయడం, కాకపోతే శిక్షించడం గతంలో జరిగింది. ఇక్కడ రాజ్యంకు కొన్ని నిర్దిష్ట లక్ష్యాలు ఉంటాయి. అవి దాని కొనసాగింపులో అలాగే ఉంటే ఆ శిక్షలు ఒకే రకంగా వుండే వీలుంది. కానీ దాని లక్ష్యాలు రాజ్యపాలకుడు మారినప్పుడల్లా మారుతూ ఉంటే శిక్షలు కూడా మారుతూ ఉంటాయి. ఈ కోవలోనే యుఏపీఏ చట్టం మార్చబడింది. దీనికి ముందు పోటా చట్టం అంతకంటే ముందు టాడా చట్టం తయారు చేశారు. ఇది ప్రధానంగా మావోయిస్టులను, ముస్లిం తీవ్రవాద కార్యక్రమాలను అడ్డుకోవడానికి వచ్చింది. కారణం ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన పరిణామాలు పరిశీలన చేసి దీన్ని తీసుకువచ్చారు. దీని కింద అరెస్ట్ అయినవారిలో కేవలం రెండు శాతం మందికే శిక్షలు ఖరారు అయ్యాయి. అంటే, అక్రమంగా అరెస్ట్ అయిన వేలాదిమంది జీవితాలు నాశనం అయినట్టే. ఆ తరువాత ఎన్డీయే ప్రభుత్వం పోటా తీసుకువచ్చింది. దీని క్రింద ఎక్కువగా రాజ్యం చాలా మందిని శిక్షించడం పేరుతో చంపివేసింది. దీని తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని తెచ్చింది. ఇప్పటి బిల్లు సంస్థలనే కాకుండా వ్యక్తులను కూడా కేంద్రంగా చేసుకొని తెచ్చారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ప్రతిపక్ష పార్టీలు ఎంత మొత్తుకున్నా హడావిడిగా బిల్లును తెచ్చారు. ఇది ఎంత ప్రమాదం అంటే ఒక మనిషిని వ్యక్తిగతంగా తీవ్రవాదిగా చూపించడానికి ఈ చట్టం వీలు కల్పి స్తుంది. ఒక సంస్థలో సభ్యులు కాకుండానే వ్యక్తిని కేంద్రంగా చూపిస్తూ తీవ్రవాదిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపించవచ్చు. మనిషి ఆలోచనల ఆధారంగా అతనిపై చట్ట వ్యతిరేక ముద్ర వేయడానికి ఇది ఉపయోగ పడుతుంది. సంస్థలను కాకుండా, వ్యక్తులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారంటే.. సంస్థలను నిర్వీర్యం చేస్తే వ్యక్తులు మరొక సంస్థను ఏర్పాటు చేసుకుంటున్నారనీ, కాబట్టి వ్యక్తులే లక్ష్యంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకోవడం వీలవుతుందని కేంద్ర హోంమంత్రి చెప్పారు. గత కొన్ని దశాబ్దాలుగా సంస్థలుగా రాజ్యంకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని చూపెడుతున్న వాటిని దృష్టిలో పెట్టుకొనే కాకుండా వివిధ సామాజిక వర్గాలు రాజ్యంపై నిరసన ప్రకటించకుండా ఉండేందుకు ముందస్తుగా ఈ చట్టాన్ని సవరించారు. ఇప్పటికే సామాజిక సంస్థలు తమ గొంతు నొక్కడానికే ఈ చట్టం తెచ్చారని ఆరోపిస్తున్నాయి. 2018లో మహారాష్ట్ర భీమా కోరేగావ్ ఘటనలో ఇప్పటికే ఈ చట్టం క్రింద చాలా మందిని అరెస్ట్ చేశారు. దీని ప్రకారం ఇప్పట్నుండీ రాజ్యంను వ్యతిరేకిస్తున్న వంకతో తమను సామాజికంగా అణచివేస్తున్నారని, తమపై అత్యాచారాలు, హత్యలు సామూహిక దాడులు జరుపుతున్నారని అటువంటి వారిని రాజ్యం శిక్షించడం లేదని ఉద్యమాలు చేసే ప్రతి వ్యవస్థను, వ్యక్తులను ఈ చట్టం తో అరెస్ట్ చేసే అవకాశం వుంది. అంటే మొత్తంగా ఈ దేశ దళితులు, ఆదివాసీలు ఇక వారికి దక్కవలసిన కనీస హక్కులు అమలు చేయమని రాజ్యంపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా అవకాశం లేనివిధంగా దీన్ని తీసుకువచ్చారు. సామాజిక అసమానతల ఆధారంగా రాబోయే ఉద్యమాలను అణచివేయడానికే ఈ చట్టం ప్రధానంగా తీసుకువచ్చారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 లోని అన్ని క్లాజులను అవమానించే విధంగా వుంది. అంటే రాజ్యంకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, రాయకూడదు. కనీసం ఆలోచనలు కూడ చేయకుండా ఉండేందుకు ఇది వచ్చింది. అసలు ఆలోచన ఆధారంగా ఒక వ్యక్తిని చట్ట ప్రకారంగా శిక్షించడం ఏ కోణంలో సమంజసం? అలాగే ఈ సమాజంలో సామాజిక వ్యవస్థ వల్ల ఎన్నో అరాచకాలు, సామూహిక హత్యలు, హత్యాచారాలు జరుగుతుంటే వీటిని అడ్డుకునేందుకు కారణమైనవారిని శిక్షించడానికి రాజ్య మెందుకు మౌనంగా ఉంటుందని ఆందోళనలు చేసినా, ఈ రాజ్యం చర్యలు తీసుకునేట్టు లేదని ఆలోచించడం ఇప్పుడు నేరమౌతుంది. దొంతి భద్రయ్య వ్యాసకర్త న్యాయవాది, కరీంనగర్ మొబైల్ : 9966677149 -
సిక్కుల ఊచకోత : కన్నీటి జ్ఞాపకాలు
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం దేశవ్యాప్తంగా సిక్కుల ఊచకోతకు గురయ్యారు. వేల సంఖ్యలో అమాయక సిక్కులు అసువులు బాసారు. 33 ఏళ్ల నాటి విషాద పరిస్థితులు.. ఆనాటి జ్ఞాపకాలు బాధితుల కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. ఇందిర హత్యానంతర పరిస్థితులకు ప్రత్యక్ష సాక్షి అయిన అత్తార్ కౌర్... కన్నీటి గాథ ఇది. సిక్కు వ్యతిరేక అల్లర్లలో అత్తార్ కౌర్ భర్తతో సహా 11 మంది కుటుంబ సభ్యులను కోల్పొయి దీనావస్థలొకి వెళ్లిపోయింది. ఆనాటి పరిస్థితులపై అత్తార్ కౌర్ పంజాబ్‌లోని ఒక న్యూస్ ఛానల్‌తో మాట్లాడారు. మారణహోమానికి 33 ఏళ్లు నాటి ప్రధాని ఇందిరాగాంధీని సిక్కు బాడీగార్డులు హత్య చేయడంతో.. ఒక్క సారిగా దేశమంతా సిక్కు వ్యతిరేకత అల్లర్లు చెలరేగాయి. ప్రధానంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో మరీ ఎక్కువగా జరిగాయి. దేశంలోని ఇతర ప్రాంతాల కంటే అధికంగా ఢిల్లీలోనే మారణహోమం అధికంగా జరిగింది. అల్లరి మూకలు అత్యంత దారుణంగా 3 వేల మంది సిక్కులను ఊచకోత కోశాయి. ఈ మారణహోమానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న సజ్జన్ కుమార్ కారకుడని సీబీఐ ఢిల్లీ సెషన్స్ కోర్టుకు తెలిపింది. చితికిన కుటుంబం అత్తార్ కౌర్ నాటి తూర్పు ఢిల్లీలోని త్రిలోకపురిలో భర్త, పిల్లలతో కలిసి నివాసముండేది. ఇందిర హత్యానంతరం అల్లరి మూకలు సిక్కులు అధికంగా నివసించే ప్రాంతాలపై దాడులకు దిగాయి. అత్తార్ కౌర్ భర్త కృపాల్ సింగ్ అక్కడే చిన్నచిన్ని వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పొషించేవాడు. కళ్లముందే దారుణం కృపాల్ సింగ్ వ్యాపార పనుల రీత్యా అప్పుడే గురుద్వారాకు వెళ్లారు. ఇంటి బయట.. 7 మంది చిన్నారులు, స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నారు. ఇంటి బయట అత్త, మామ ఉన్నారని అత్తర్ కౌర్ తెలిపారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వచ్చిన అల్లరి మూకలు.. ఆడుకుంటున్న చిన్నారులను, బయ ఉన్న పెద్దవారిని అత్యంత పాశవికంగా హత్య చేశాయని ఆమె చెప్పారు. తన రెండు నెలల పసిబిడ్డతో సహా, 6 మంది పిల్లలను, భర్త, అత్తమామలసహా 11 మంది కుటుంబ సభ్యులను అల్లరి మూకలు పొట్టన పెట్టుకున్నాయని ఆమె ఆవేదనగా తెలిపారు. సజీవ దహనం జంతువులును వేటాడినట్టు అల్లరి మూకలు సిక్కులను వెంటాడి వేటాడి చంపాయని అత్తార్ కౌర్ కన్నీరు పెట్టుకుంటూ తెలిపారు. కొద్దిమందిని దారుణంగా హింసించి.. సజీవ దహనం చేసిన ఘటనలు ఉన్నాయని కౌర్ తెలిపారు. ముస్లింల సాయం అల్లరి మూకలు మరింత దారుణాలకు ఒడిగడుతున్న సమయంలో మాకు పక్కనే ఉన్న ఒక ముస్లిం కుటుంబం.. మిగిలిన ముగ్గురు పిల్లలను, నాకు వారి ఇంట్లో రక్షణ కల్పించారని ఆమె తెలిపారు. సాయంత్రం ట్రిపోలి రహదారి పక్కన పిల్లల మృత దేహాలు, దహనమైన అత్త, మామలు, భర్త శరీరాలను చూశానని ఆమె హృదయ విదారకంగా తెలిపారు. ఇందిరా హత్యానంతర పరిస్థితులు గుర్తుకు వస్తే.. ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుందని ఆమె చెప్పారు. -
ఇందిరాగాంధీ హత్య అతనికి ముందే తెలుసు
లండన్: దివంగత ప్రధాని ఇందిరా గాంధీ హత్యోదంతానికి సంబంధించిన సంచలన విషయం ఒకటి వెల్లడైంది. ఇందిర హత్యకు గురవుతారన్న సంగతి ఓ వ్యక్తికి ముందే తెలుసని బ్రిటన్ గురువారం విడుదల చేసిన ఓ డాక్యుమెట్ లో బయటపడింది. ఆ వ్యక్తి పేరు జగ్జీత్ సింగ్ చౌహాన్. ఇతను యూకేలో ఉంటూ ఖలిస్థాన్ ఉద్యమంపై అనేక ఆందోళనలను చేశాడు. 'సిఖ్ రిపబ్లిక్ ఆఫ్ ఖలిస్తాన్' పేరుతో సంస్థను స్థాపించిన చౌహాన్.. పలు మార్లు సంచలన ప్రకటనలు చేసేవాడు. ఇందిరా గాంధీ మరొకొద్ది నెలల్లో హత్యకు గురవుతుందనే విషయం జగ్జీత్ సింగ్ చౌహాన్ కు తెలుసని, ఆయన ప్రకటనలు బ్రిటన్, భారత్ ల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపేవిగా ఉండేవని, అందుకే నాటి బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ చౌహాన్ పై చర్యలకు ఉపక్రమించిందని డాక్యుమెంట్లలో వెల్లడైంది. భారత ప్రభుత్వం కూడా చౌహాన్ పై బ్రిటన్ కు ఫిర్యాదు చేసినట్లు, ఇందిరతోపాటు ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ కూడా మరణిస్తాడని చౌహాన్ విచారణాధికారులకు చెప్పినట్లు డాక్యుమెంట్ల ద్వారా తెలిసింది. ఎవరీ చౌహాన్? ఖలిస్థాన్ ను ప్రత్యేక దేశంగా పరిగణించాలంటూ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తుల్లో ముఖ్యుడు జగ్జీత్ సింగ్ చౌహాన్. పంజాబ్ లో పుట్టిపెరిగిన ఇతను వైద్య విద్య పూర్తిచేసి డాక్టర్ గా సేవలందిచేవాడు. కొద్ది కాలం తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. పంజాబ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గానూ పనిచేసిన చౌహాన్.. 1971లో లండన్ కు వలసవెళ్లారు. అక్కడ 'సిఖ్ రిపబ్లిక్ ఆఫ్ ఖలిస్తాన్' సంస్థ ద్వారా ఖలిస్థాన్ ఉద్యమాన్ని కొనసాగించారు. ప్రత్యేక ఖలిస్థాన్ కోసం పాక్, అమెరికా, కెనడాల మద్దతు కూడగట్టేందుకు విఫలయత్నం చేశారు. 2001లో ఇండియాకు తిరిగొచ్చిన ఆయన ఖల్సా రాజ్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ పెద్దగా జనాదరణ పొందలేకపోయింది. 2007లో 78 ఏళ్ల వయులో చౌహాన్ మరణించారు.