కెనడా: కెనడాలో ఆపరేషన్ బ్లూస్టార్ 39 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఖలిస్థాన్ మద్దతుదారులు నిర్వహించిన పెరేడ్లో భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని రిక్రియేట్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. దీన్ని హేయమైన చర్యగా అభివర్ణిస్తూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వెంటనే దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్, మిలింద్ దేవర.
శకటంపై ప్రదర్శన...
ఆపరేషన్ బ్లూస్టార్ పేరిట 1984లో ఆనాటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఆదేశాల మేరకు జూన్ 6న భారత సైనిక బలగాలు స్వర్ణదేవాలయంలోకి ప్రవేశించాయి. దానికి ప్రతిగా అదే ఏడాది అక్టోబర్ 31న ఇందిరా గాంధీని ఆమె భద్రతా సిబ్బంది అత్యంత కిరాతకంగా కాల్పులు చేసి హతమార్చారు. ఇది జరిగి 39 ఏళ్ళు పూర్తైన నేపథ్యంలో కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఖలిస్థాన్ మద్దతుదారులు 5 కి.మీ మేర పెరేడ్ నిర్వహించారు.
ఆ సంఘటనను కళ్ళకు కడుతూ శకటంపై ఆనాడు భారత ప్రధానిని ఏ విధంగా చంపారో బొమ్మలతో సహా ప్రదర్శించారు నిర్వాహకులు. శకటం మీద శ్రీ దర్బార్ సాహిబ్ హత్యకు ప్రతీకారంగానే ఆమె హత్య జరిగినట్లు ఒక సందేశాన్ని కూడా ఉంచారు పెరేడ్ నిర్వాహకులు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.
ఇది అవమానించడమే...
ఇదే వీడియోని జత చేసి మిలింద్ దేవర ట్విట్టర్లో స్పందిస్తూ... కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఇందిరా గాంధీ హత్యను సంబరంగా చేసుకుంటూ 5 కి.మీ మేర పెరేడ్ నిర్వహించారని తెలిసి దిగ్భ్రాంతి చెందాను. ఒకరి పక్షాన ఉండటం కాదుగాని ఒక దేశ చరిత్రకు ఆ మరణం వలన ఆ దేశానికి కలిగిన బాధను గౌరవించాలి. ఈ చర్యను అందరూ ఖండించాలన్నారు.
విదేశాంగ శాఖ మంత్రి నిద్రపోతున్నారా?
ఈ ట్వీట్ కు స్పందిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని సంబరంగా చేసుకుంటుంటే చోద్యం చూస్తున్నారా? వెంటనే విదేశాంగమంత్రి జైశంకర్ దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు.
ఇదే విషయంపై కెనడియన్ హై కమీషనర్ కామెరూన్ మేక్ కే కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: ఆత్మహత్యే శరణ్యం.. కెనడాలో భారత విద్యార్థుల ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment