కాంగ్రెస్‌కు రాజ్యాంగంపై ప్రేమను వ్యక్తపరిచే హక్కు లేదు: మోదీ | PM Modi: No right to Congress To profess their love for Constitution | Sakshi
Sakshi News home page

ఎమర్జెన్సీ విధించిన వారికి రాజ్యాంగంపై ప్రేమను చూపే హక్కు లేదు : మోదీ

Published Tue, Jun 25 2024 12:21 PM | Last Updated on Tue, Jun 25 2024 12:33 PM

PM Modi: No right to Congress To profess their love for Constitution

న్యూఢిల్లీ: దేశంలో ఇందిరా గాంధీ హ‌యాంలో ఎమ‌ర్జెన్సీ విధించి నేటితో (జూన్ 25) 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ  కాంగ్రెస్‌పై విరుచుకుప‌డ్డారు. అప్ప‌ట్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరించి దేశాన్ని జైలుగా మార్చింద‌ని మండిప‌డ్డారు.

ఈ మేర‌కు రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు మోదీ గట్టిగా బదులిచ్చారు. అత్యవసర స్థితిని విధించిన వారికి ఇప్పుడు రాజ్యాంగంపై తమ ప్రేమను చాటుకునే హక్కు హ‌స్తం పార్టీకి లేదని విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఎమ‌ర్జెన్సీ రోజుల‌ను గుర్తుచేస్తూ ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా వరుస ట్వీట్లు చేశారు. ఎమర్జెన్సీని ప్రతిఘటించిన వారికి నివాళులు అర్పిస్తున్న‌ట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని, ప్రాథమిక స్వేచ్ఛను ఎలా కాంగ్రెస్  తుంగలో తొక్కింద‌ని అన్నారు. ఎమ‌ర్జెన్సీ ప్రజలకు ‘చీకటి రోజులు’గా మారింద‌ని విమ‌ర్శించారు.

 ‘ఎమర్జెన్సీని ప్ర‌తిఘ‌టించిన మహనీయులందరికీ నివాళులర్పించే రోజు ఇది. ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను, ప్రతి భారతీయుడూ గౌరవించే రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తుంగలో తొక్కింది. కేవలం అధికారాన్ని కాపాడుకోవడం కోసం అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలను విస్మరించి దేశం మొత్తాన్ని జైలుపాలు చేసింది. ఆ పార్టీని వ్యతిరేకించిన వారిని హింసించారు, వేధించారు. బడుగు, బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకొని దారుణమైన విధానాలను అమల్లోకి తెచ్చారు.

 ఎమర్జెన్సీ విధించిన వారికి రాజ్యాంగంపై తమ ప్రేమను చాటుకునే నైతిక హక్కు లేదు. ఎమర్జెన్సీ విధించిన పార్టీయే లెక్కలేనన్ని సందర్భాలలో ఆర్టికల్ 356ను విధించింది. పత్రికా స్వేచ్ఛను నాశనం చేసే ఎన్నో బిల్లులను తెచ్చారు. ఫెడరల్‌ వ్యవస్థను నాశనం చేశారు. రాజ్యాంగంలోని ప్రతిఅంశాన్ని ఉల్లంఘించారు. 

 కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఎమర్జెన్సీ మనస్తత్వం సజీవంగా ఉంది. రాజ్యాంగంపై వారికి ఉన్న అయిష్టాన్ని దాచిపెట్టి ఇప్పుడు నటిస్తున్నారు. అయితే, వారి ప్రవర్తనను ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే పదేపదే కాంగ్రెస్‌ పార్టీని తిరస్కరిస్తున్నారు’ అని మోదీ పేర్కొన్నారు.

 కాగా జూన్ 25, 1975న, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించారు. ఈ సమయంలో పౌర హక్కులను హ‌రించివేశారు. ప్ర‌తిప‌క్ష నాయకులు, అసమ్మతివాదులు, అనేక‌మంది ప్ర‌జ‌లు జైలు పాలయ్యారు. పత్రికా స్వేచ్ఛ‌పై ఆంక్ష‌లు పెట్టారు. ఇది 1977 వరకు 21 నెలల పాటు అమలులో ఉంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన కాలాల్లో ఎమర్జెన్సీ ఒకటిగా ఉండిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement