
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎనిమిది మృతదేహాలు లభ్యమైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనలో పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఘటన జిల్లాలోని కోఖ్‌రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భర్వారీ పట్టణంలో చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఫ్యాక్టరీలో చిక్కుకున్న 10 మంది బాధితులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
ఫ్యాక్టరీలో ఇంకా ఎనిమిది మంది చిక్కుకున్నారని స్థానికులు అంటున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న యూపీ సీఎం యోగి అధికారులను అప్రమత్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు తగిన చికిత్స అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.