ఖానాపూర్: ఈ నెల నుంచి రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేసే సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్ పేర్కొన్నారు. ఖానాపూర్ పట్టణంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం కాలం వెల్లదీస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు కిలోల బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కిలో మాత్రమే కలుపుతూ అంతా తామే అన్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటోందని దుయ్యబట్టారు.
వివిధ పథకాలకు కేంద్రం నిధులు వినియోగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోదీ ఫొటోను విస్మరించడం సరి కాదని తెలిపారు. ఈజీఎస్ నిధులతో ఊ రూరా సీసీ రోడ్లు నిర్మిస్తూ వాటినీ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పార్టీ అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆకుల శ్రీనివాస్, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు ఉపేందర్, మనోజ్, నాయకులు రమేశ్, గోపాల్‌రెడ్డి, కిషన్, భూమన్న, స్వామి, రవి, జీవన్, లింబాద్రి తదితరులున్నారు.

‘సన్నబియ్యం కేంద్రమే ఇస్తోంది’