జిల్లాలో గొలుసు దొంగలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో గొలుసు దొంగలు

Published Fri, Apr 25 2025 1:12 AM | Last Updated on Fri, Apr 25 2025 1:12 AM

జిల్లాలో గొలుసు దొంగలు

జిల్లాలో గొలుసు దొంగలు

● బరితెగిస్తున్న చైన్‌ స్నాచర్లు ● నడిరోడ్డుపైనే నగలు లాక్కెళ్తున్నారు.. ● బయటకు వెళ్లడానికి జంకుతున్న మహిళలు ● పోలీసులకు సవాల్‌

నిర్మల్‌టౌన్‌: ఒకవైపు బంగారం ధరలు రూ.లక్షకు చేరువైంది. మరోవైపు ఈజీ మనీ కోసం దొంగలు రెచ్చిపోతున్నారు. భయం బెరుకు లేకుండా బరితెగిస్తున్నారు. జిల్లాలో కొన్ని రోజులుగా జరుగుతున్న చైన్‌ స్నాచింగ్‌లు మహిళలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దొంగలు పక్కా ప్రణాళికతో మాటువేసి గొలుసులు లాక్కెళ్తున్నారు. పట్టపగలే ఎలాంటి భయం లేకుండా చోరీలకు పాల్పడుతున్నారు. వరుస ఘటనలతో జిల్లాలో గొలుసు దొంగల ముఠా సంచరిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. బైక్‌లపై వచ్చే దొంగలు ఒంటరి మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని తాళిబొట్లు, గొలుసులు లాక్కుంటున్నారు. పట్టణాల నుంచి గ్రామాలకు తమ రూటు మార్చిన ఈ ముఠాలు, మాయమాటలతో లేదా హఠాత్తుగా దాడి చేసి దోచుకుంటున్నారు.

పోలీసులకు సవాల్‌..

పోలీసుల పెట్రోలింగ్‌, సీసీ కెమెరాలు, చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ దొంగలు ఆనవాళ్లు లేకుండా తప్పించుకుంటున్నారు. మహారాష్ట్ర సరిహద్దు, జాతీయ రహదారులు దొంగలకు పారిపోయేందుకు సౌలభ్యంగా మారాయి. ప్రజలు భద్రతా చర్యలు పెంచాలని, ముఖ్యంగా ఒంటరిగా బంగారం ధరించి బయటకు వెళ్లడం మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాత్రివేళల్లో అపరిచితులతో మాట్లాడకుండా, తోడుగా వెళ్లడం, ఇంటి లోపల మాట్లాడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. పోలీసులు గస్తీని మరింత ఉద్ధృతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

పక్క రాష్ట్రం నుంచి....

జిల్లా సరిహద్దులో మహారాష్ట్ర ఉండడంతో నిత్యం రాకపోకలు కొనసాగుతుంటాయి. అంతేకాకుండా జిల్లాలో 44, 61 నంబర్‌ జాతీయ రహదారులు ఉండడంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు నేరుగా దొంగతనాలు చేసి పారిపోతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

● మహిళలు ఒంటరిగా వెళ్తున్నప్పుడు మెడలో బంగారం ధరించడం చాలా ప్రమాదకరం.

● వీలైనంతవరకు బయటకు వెళ్లేటప్పుడు ఎవరినైనా తోడుగా తీసుకెళ్లాలి.

● అపరిచితులు పలకరిస్తే మాట్లాడవద్దు. వారు మాటల్లో దింపి చోరీ చేసే అవకాశం ఉంది.

● ఇళ్ల వద్దకు అపరిచిత వ్యక్తులు వస్తే లోపల ఉండి మాట్లాడడం మంచిది.

ఇటీవలి ఘటనలు..

● ఈ ఏడాది జనవరి 15న జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేట్‌ కాలనీకి చెందిన నళిని తన కూతురితో కలిసి కాలనీలో నడుచుకుంటూ వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు రూ.1.50 లక్షల విలువైన బంగారు గొలుసులు లాక్కెళ్లారు.

● ఈనెల 13న జిల్లా కేంద్రంలోని పాత నటరాజ్‌ మిల్‌ సమీపంలో ముగ్గురు యువకులు మహిళ మెడలో నుంచి చైన్‌ లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన మహిళలు కేకలు వేయడంతో స్థానికులు బైక్‌పై వచ్చిన ముగ్గురిని వెంబడించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

● ఇటీవలే తానూర్‌ మండలం బొంద్రట్‌ గ్రామంలో నడుచుకుంటూ.. వెళ్తున్న ఓ మహిళ మెడలోని పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి లాక్కెళ్లాడు.

● ఈనెల 19న సారంగాపూర్‌ మండలం జామ్‌ గ్రామానికి ఇద్దరు మహిళలు ఆటోలో నిర్మల్‌ నుంచి బయలుదేరారు. వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై ఆటోను అనుసరిస్తూ.. వచ్చిన ఇద్దరు దొంగలు ధని గ్రామ సమీపంలోని మూల మలుపు వద్దకు చేరుకోగానే ఆటో స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద వేగం తగ్గించడంతో.. వెనుక వైపు కూర్చున్న సునీత, గంగమణి మెడలోని 26 గ్రాముల బంగారు గొలుసులు లాక్కెళ్లారు.

● ఈనెల 20న లక్ష్మణచాంద మండలం వడ్యాల్‌ గ్రామానికి చెందిన రామవ్వ తమ బంధువుల వివాహ వేడుకకు ఇంటి పక్కన ఉన్న భీమేష్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై నిర్మల్‌కు బయలుదేరింది. మార్గమధ్యలో కనకాపూర్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు తాము పోలీసులమని చెప్పి బైక్‌ను ఆపారు. ముందు హత్య జరిగిందని, అటువైపు వెళ్లొద్దని, మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి లోపల పెట్టుకోవాలని సూచించారు. దీంతో ఆ మహిళ మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు తీసి పర్సులో పెట్టుకునే క్రమంలో తాను పెట్టిస్తామని చెప్పి గొలుసు మాయం చేసి ఖాళీ పర్సు ఇచ్చారు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. మహిళ పర్సు తీసి చూడగా అందులో రాళ్లు కనిపించాయి.

జాగ్రత్తగా ఉండాలి..

జిల్లాలో చైన్‌స్నాచింగ్‌ ఘటనలపై దృష్టిపెట్టాం. గతంలో కొన్నిముఠాలు మాత్రమే ఉండేవి. ఇటీవల కొత్త దొంగలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజలు కూడా అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద వ్యక్తులు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.

– జానకీషర్మిల, ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement