
అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి
నిర్మల్‌చైన్‌గేట్:పాఠశాలలకు ఇచ్చిన విధంగా అంగన్‌వాడీ కేంద్రాలకు మే నెల మొత్తం సెలవులు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ అన్నారు. హక్కుల సాధన కోసం అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేశారు. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలను బలహీన పరిచేందుకే కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం తీసుకువచ్చిందన్నారు. జీవో 14ను వెంటనే రద్దు చేయాలన్నారు. 50 సంవత్సరాలుగా అంగన్‌వాడీ కేంద్రాలు కృషి ఫలితంగా 15 రకాల జబ్బులు నివారించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలు బలహీనపరచడం వలన బలహీనవర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్రాల్లో ఇప్పటికే పూర్వ ప్రాథమిక విద్య కొనసాగిస్తున్నారని దీనిని సమర్థవంతంగా నిర్వహించడానికి మెరుగైన వసతులు కల్పించాలన్నారు. నూతన విద్యా విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వినాశకర విధానాలు ఐసీడీఎస్‌ను ప్రజలకు దూరం చేస్తున్నాయన్నా రు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒకే యాప్‌ను అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మినీ కేంద్రాల టీచర్ల వేతనాలు విడుదల చేయాలని కోరారు. కేంద్రాలకు పక్కా భవనాలు, మరుగుదొడ్లు నిర్మించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ఉపాధ్యక్షులు దేవిక, లావణ్య, రేష్మ, జిల్లా సహాయ కార్యదర్శిలు రమ్య, భాగ్య, జిల్లా నాయకులు పుష్పలత కవిత, మీనాక్షి, నర్సమ్మ పాల్గొన్నారు.