● జిల్లాలో తీవ్ర వడగాడ్పులు ● అవస్థలు పడుతున్న జనం
సాక్షి, పార్వతీపురం మన్యం: భానుడు నిప్పులు చిమ్ముతున్నాడు. వడగాల్పులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. శుక్రవారం జిల్లాలోని గరుగుబిల్లి, వీరఘట్టం, పాలకొండ, సీతంపేట, సీతానగరం తదితర మండలాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం కూడా బలిజిపేట, గరుగుబిల్లి, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో 43 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని విపత్తుల శాఖ అంచనా. తొమ్మిది మండలాల్లో వేడి గాలులు, రెండు మండలాల్లో తీవ్ర వేడిగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడ దెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు అవసరమని, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించింది.