
రామతీర్థంలో జనసేన – టీడీపీ నాయకుల కొట్లాట
నెల్లిమర్ల రూరల్: మండలంలోని రామతీర్థం గ్రామంలో శుక్రవారం రాత్రి టీడీపీ, జనసేన నాయకులు పరస్పర కొట్లాటకు దిగారు. ఈ ఘటనపై ఇరు వర్గాలకు చెందిన బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనసేన పార్టీ నేతగా వ్యవహరిస్తున్న పైడిరాజు ఇటీవల తన పొలంలో ఉన్న తాటి చెట్లను తొలగించారు. తన భూమి పరిధిలో ఉన్న చెట్లను సమాచారం ఇవ్వకుండా ఎందుకు తొలగించావని టీడీపీ నాయకడు తాడ్డి సత్యనారాయణ జనసేన నేత పైడిరాజు ఇంటికి వెళ్లి ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ కొట్లాటలో ఇద్దరికీ గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. దీనిపై ఎమ్మెల్సీ నమోదు కాగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా జనసేన నాయకుడు పైడిరాజు మాట్లాడుతూ గతంలో తన భూమి పరిధిలో ఉన్న చెట్లను కూడా తొలగించారని, కేవలం రాజకీయంగా తన ఎదుగుదల చూడలేకే తనపై దాడి చేశారని తెలిపాడు.
వేతనదారులకు రెండు బీమా పఽథకాలు
విజయనగరం ఫోర్ట్: ఉపాధి హామీ వేతనదారులు దురదృష్టవశాత్తు మరణించినా, ప్రమాదం కారణంగా వైకల్యం సంభవించినా బీమా రక్షణ అందించే రెండు పథకాలు అమలులో ఉన్నట్టు డ్వామా పీడీ ఎస్.శారదాదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వేతనదారులు రూ.20 సంవత్సరానికి చెల్లించాలన్నారు. ఈ పథకం కింద ప్రమాదవశాత్తూ మరణించిన, లేదా పూర్తి వైకల్యం కల్గిన వారికి రూ.2లక్షలు పరిహారం పొందగలరన్నారు. పాక్షికంగా వైకల్యం పొందిన వారికి రూ.లక్ష పొందవచ్చునన్నారు. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన కింద 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు వారు రూ.435 ప్రీమియం ప్రతి సంవత్సరం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఏ కారణంగా మరణించిన వారి వారసులకు రూ.2 లక్షల పరిహారం అందుతుందన్నారు. ఈ బీమాల కోసం పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌లో ఖాతా నమోదు చేసుకోవాలన్నారు. వారి ఆధార్ అనుసంధానం చేయించుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9849903737 నంబరుకు సంప్రదించాలని సూచించారు.