
కరీంనగర్/పెగడపల్లి: ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. తమ అనుచరుల్లోని ముఖ్యులను రంగంలోకి దింపి ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. ప్రధానంగా సామాజికవర్గాల వారీగా ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు కుస్తీ పడుతున్నారు. కుల పెద్దలను రహస్యంగా సంప్రదిస్తున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా ఉన్న ఓట్లను సామాజికవర్గాల వారీగా గుర్తించి ఆకట్టుకునేందుకు బృందాలు ఏర్పాటు చేశారు. పగలు ప్రచారం.. రాత్రి మంతనాలు సాగిస్తూ అభ్యర్థులతో పాటు వారి అనుచరులు పడరాని పాట్లు పడతున్నారు.
కూడికలు.. తీసివేతలు
అన్ని సామాజికవర్గాల మద్దతు లభిస్తే విజయం సునాయాసమన్న భావనలో అభ్యర్థులున్నారు. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నేపథ్యంలో మొత్తం ఓటర్లలో ఏఏ సామాజిక వర్గానికి ఓట్లు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. గెలుపోటములు నిర్దారించే పోలింగ్ బూత్‌లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. సామాజికవర్గాల వారీగా ఓటర్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఓ టీం తయారు చేసుకొని తీసివేతలు, కూడికలు మొదలుపెట్టారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు కలిగి ఉన్న సామాజికవర్గాన్ని గుర్తించి వారి మద్దతును తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారు. ప్రతీ నియోజకవర్గంలో 40 నుంచి 45శాతం ఓటర్ల మద్దతును కూడగట్టుకుంటే విజయం తథ్యమనే భావన అభ్యర్థుల్లో నెలకొంది. ఇప్పటికే పలు రాజకీయపక్షాలకు అనుకూలంగా వ్యవహరించే ఓటర్లను మినహాయించి తటస్థంగా ఉన్న ఓటర్లపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు.
కులపెద్దలతో మంతనాలు
ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు కులాలు, మతాల వారీగా ఓటర్లను గుర్తించి ఆయా వర్గాలకు చెందిన పెద్దలతో అనుచరగణం సాయంతో మంతనాలు చేస్తున్నారు. ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా ఫోన్లలో వారిని అప్యాయంగా పలుకరించి గెలుపునకు సహకరించాలని కోరుతున్నారు. ఇదే సమయంలో స్థానిక సమస్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వారితో ప్రస్తావించి గెలిచిన వెంటనే తొలిప్రాధాన్యమిచ్చి పరిష్కరిస్తామని హమీలిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో కొన్ని సామాజికవర్గాల అభ్యర్థులు గెలుపోటములను శాసిస్తున్నాయి. అలాంటి సామాజికవర్గాన్ని గ్రామాల వారీగా గుర్తించేందుకు అభ్యర్థులు పక్కా ప్రణాళిక రూపొందించుకునే పనిలో నిమగ్నమయ్యారు. తుది ఓటర్ల జాబితాలోని ఓటర్ల శాతానికి అనుగుణంగా సామాజికవర్గాలను ఆకర్షించేందుకు అభ్యర్థులు అంకెల గారడీతో కుస్తీ పడుతూ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తుతుండడంతో రాజకీయ రణరంగం రసవత్తరంగా మారుతోంది.
సమయం లేక అభ్యర్థుల అవస్థలు
అసలే మాఘి పొద్దు. పొద్దంతా తక్కువగా సమయం ఉంటుంది. రాత్రంతా చలి. అందులో ప్రచారానికి సమయం ఉండటం లేదు. సహజంగా ఎన్నికలప్పుడు తప్ప నాయకులు ఎప్పుడు గ్రామాలకు రాలేదంటారు. కానీ ఎన్నికల వేళ కూడా అభ్యర్థులు ఓట్లు అడిగేందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు వెళ్లి ఓట్లు అడిగే సమయం లేదు. దీంతో ప్రధాన గ్రామాలపై దృష్టి సారించిన నేతలు పగలు ప్రచారం చేస్తూ రాత్రి వేళ మంతనాలు చేస్తున్నారు.
కార్యకర్తలపైనే ఆధారం
ప్రచారానికి సమయం లేకపోవడం, పైగా గ్రామాలు ఎక్కువగా ఉండటంతో ఆయా పార్టీల అభ్యర్థులు కార్యకర్తలపైనే ఆధారపడుతున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని అవసరమున్న గ్రామాలకు మాత్రమే వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకుని చక్కదిద్దే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా వలసలు, చేరికలు తదితర వాటిపై నేతలు దృష్టి సారించారు. చివరి రోజుల్లో ర్యాలీ ఏర్పాట్లకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయా మండలాల్లో అత్యధిక ఓటర్లున్నా గ్రామాలకు వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. సమయం లేకపోవడంతో ఎన్నికల ప్రచారం ఒక వంతుగా చూస్తే అభ్యర్థులకు సవాలుగా మారినట్లే.