
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు ప్లాన్ జరిగిందంటూ ఈటల జమున తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల భద్రతపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది.
ఈ క్రమంలో ఈటల రాజేందర్ నివాసానికి డీసీసీ సందీప్ రావు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఈటల భద్రత అంశంపై ఆయనతో సమావేశమై అరగంట పాటు చర్చించారు. అనంతరం, ఈటల ఇంటి నుంచి డీసీపీ వెళ్లిపోయారు. ఇక, వీరి భేటి నేపథ్యంలో ఈటల భద్రతపై డీసీపీ సందీప్ రావు.. డీజీపీ అంజనీకుమార్‌కు నివేదిక ఇవ్వనున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈటల రాజేందర్ చెప్పిన అంశాలను డీజీపీ వివరిస్తామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. ఈటల ఇంటి పరిసరాలను అధికారులు నిన్న(బుధవారం) పరిశీలించారు. అయితే, ఈటల భద్రతను సమీక్షించాలని మంత్రి కేటీఆర్.. డీజీపీని ఆదేశించారు. దీంతో, రాజేందర్ భద్రత పెంపుపై డీజీపీ అంజనీకుమార్ నేతృత్వంలో సమీక్ష జరిగింది. మరోవైపు.. తన హత్యకు కుట్ర జరుగుతోందని, ప్రాణహాని ఉందని ఈటల ఇప్పటికే తెలిపారు. ఈ క్రమంలో ఈటలకు కేంద్రం వై కేటగిరి భద్రత పెంపు వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
ఇది కూడా చదవండి: ఈటల భద్రతపై కేటీఆర్ ఆరా.. రంగంలోకి సీనియర్ ఐపీఎస్