
రంగన్నగూడెంలో లోకేష్ రాక సందర్భంగా టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి..
సాక్షి, కృష్ణా: జిల్లాలో తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యాత్ర సందర్భంగా.. ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బజారు రౌడీల్లాగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి.
లోకేశ్ రాక సందర్భంగా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాయి టీడీపీ శ్రేణులు. అయితే అదే సమయంలో కౌంటర్‌గా సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశాయి వైఎస్సార్‌సీపీ శ్రేణులు. ఈ పరిణామాన్ని టీడీపీ గుండాలు జీర్ణించుకోలేకపోయారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించేసి.. కర్రలతో ఇష్టానుసారంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పోలీసులను ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే వల్లభనేని పరామర్శ.. ఫిర్యాదు
రంగన్నగూడెం చేరుకున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీ మూకల దాడిలో గాయపడిన వైసీపీ శ్రేణులను పరామర్శించారు. లోకేష్ సమక్షంలోనే వంద మందికి పైగా మూకుమ్మడిగా తమ పై దాడిచేశారని వంశీ ఎదుట వాపోయారు బాధితులు. బాధితులతో కలిసి వీరవల్లి పోలీస్టేషన్ కు బయల్దేరిన ఎమ్మెల్యే వంశీ.. ఘటనపై వీరవల్లి పోలీసులకు ఫిర్యాదు చేయయనున్నారు.