
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరులో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ను పూర్తిగా పక్కన పెట్టేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు పోటాపోటీగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. తన నివాసం వద్ద చంద్రబాబు బర్త్ డే వేడుకలను కొలికపూడి శ్రీనివాస్ ఏర్పాటు చేయగా, ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఛైర్మన్ శావల దేవదత్ ఫ్యాక్టరీ సెంటర్‌లో ఈ వేడుకల నిర్వహించారు.
అయితే, ఎమ్మెల్యే కొలికపూడి నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు దూరంగా ఉన్నారు. శావల దేవదత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి తిరువూరు నియోజకవర్గంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
కాగా, ఇటీవల ఎమ్మెల్యే కొలికపూడిని చంద్రబాబు.. ఘోరంగా అవమానించిన సంగతి తెలిసిందే. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి రోజునే కొలికపూడికి అవమానం జరగడం గమనార్హం. చంద్రబాబుకు తాను నమస్కారం పెట్టి పలకరించినా అదేమీ బాబు పట్టించుకోలేదు.. కొలికపూడికి కరచాలనం కూడా చేయకుండానే వెళ్లిపోయారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్లలో పర్యటనకు వచ్చారు.
ముప్పాళ్లలో హెలికాప్టర్ దిగిన చంద్రబాబు.. అక్కడున్న టీడీపీ నేతలను పలికరిస్తూ కరచాలనం చేస్తూ ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి కూడా చంద్రబాబుకు నమస్కరించారు.. ఆయన్ను చూసిన బాబు ముఖంలో సీరియస్‌నెస్ కనిపించింది. దీంతో, కొలికపూడిని పట్టించుకోకుండా.. చూసీచూడనట్టుగా బాబు ముందుకు సాగారు.