
హైదరాబాద్: వన్ నేషన్ - వన్ ఎలక్షన్(One Nation-One Election) అనేది దేశ భవిష్యత్ ఎజెండా అని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పష్టం చేశారు. ఇది బీజేపీ ఎజెండా కాదని, దేశ భవిష్యత్ ఎజెండా అని పేర్కొన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జి సునీల్ బన్సర్, చంద్రశేఖర్ తివారీలు పాల్గొన్నారు.
దీనిలో భాగంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలు వరుసగా తెలంగాణలో జరిగాయి. రెండు సంవత్సరాలుగా ఎన్నికల కోసమే రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రధాన మంత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి వస్తుంది. వికసిత భారత్ కోసం కృషి చేయాల్సిన సమయం.. ఎన్నికల కోసం వెచ్చించాల్సి వస్తుంది.
ఎన్నికల కోసం సమయం వృథా అవుతోంది. అభివృద్ధికి అడ్డంకిగా ఎన్నికలు మారుతున్నాయి. ప్రతీసారి ఎన్నికల పేరు మీద రాజకీయ పార్టీల సమయం వృథా అవుతుంది. తెలంగాణలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పై రాజకీయాలకు అతీతంగా చర్చలు పెట్టాలి. స్వచ్చంధ సంస్థలతో విద్యార్థులతో, యువతతో పార్టీతో సంబంధం లేకుండా సంతకాలు సేకరణ చేయాలి. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అనేది బీజేపీ(BJP) ఎజెండా కాదు... దేశ భవిష్యత్ ఎజెండా’ అని ఆయన పేర్కొన్నారు.