
న్యూఢిల్లీ: వరల్డ్ బాక్సింగ్ కప్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్ అభినాశ్ జమ్వాల్ (65 కేజీలు) పసిడి పతకానికి అడుగు దూరంలో నిలిచాడు. బ్రెజిల్‌లోని ఫాజ్ డు ఇగాకు నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో అభినాశ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో అభినాశ్ 5–0తో ఇటలీ బాక్సర్ మలంగపై ఏకపక్ష విజయం సాధించాడు. 22 ఏళ్ల అభినాశ్... ఫైనల్లో బ్రెజిల్‌కు చెందిన యూరీ రెయిస్‌తో తలపడతాడు. ఐదుగురు జడ్జీల్లో నలుగురు జమ్వాల్‌కు ‘పర్‌ఫెక్ట్ 30’ పాయింట్లు ఇచ్చారు.
మొదటి, మూడో రౌండ్‌లో అందరూ ఏకగ్రీవంగా అతనికే పాయింట్లు అందించడం విశేషం. మరో సెమీఫైనల్లో మనీశ్ రాథోడ్ ఓటమి పాలై కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. 55 కేజీల సెమీస్‌లో మనీశ్ 0–5తో నూర్‌సుల్తాన్ అల్టిన్‌బెక్ (కజకిస్తాన్) చేతిలో ఓడాడు. ఈ టోర్నీలో భారత బాక్సర్ హితేశ్ (70 కేజీలు) ఇప్పటికే ఫైనల్‌కు చేరగా... జాదూమణి సింగ్ (50 కేజీలు), విశాల్ (90 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు.
19 దేశాలకు చెందిన 130 మంది బాక్సర్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌లో... భారత్ నుంచి 10 మంది బరిలోకి దిగారు. అందులో నలుగురు బాక్సర్లు ఆరంభ రౌండ్లలోనే ఓడిపోగా... మరో నలుగురు కాంస్య పతకాలు సాధించారు.