
PC: DC X
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner)మరో టీ20 లీగ్‌లో భాగం కానున్నాడు. అమెరికాకు చెందిన మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లో సీటెల్ ఒర్కాస్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని సీటెల్ ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది. ఆస్ట్రేలియా సూపర్ స్టార్ డేవిడ్ వార్నర్ తమతో జట్టు కట్టినట్లు తెలిపింది.
కాగా ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న ఎన్నో టీ20 లీగ్‌లలో వార్నర్ భాగమయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో పాటు బిగ్ బాష్ లీగ్ (ఆస్ట్రేలియా), ది హండ్రెడ్ (ఇంగ్లండ్), ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (UAE), పాకిస్తాన్ సూపర్ లీగ్‌లలో వివిధ జట్లకు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
12956 పరుగులు.. సగం ఐపీఎల్‌లోనే
ఇక టీ20 ఫార్మాట్లో వార్నర్‌కు గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి వరకు 402 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 12956 పరుగులు సాధించాడు. ఇందులో ఐపీఎల్‌లో ఆడిన మ్యాచ్‌లు 184 కాగా.. సాధించిన పరుగులు 6565. 2009లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన వార్నర్ నిలకడైన ఆటతో రాణించాడు.
అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు
అంతేకాదు 2016లో కెప్టెన్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టైటిల్ అందించాడు. చివరగా గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగిన వార్నర్.. ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం 168 పరుగులే చేశాడు. ఈ క్రమంలో మెగా వేలం-2025కి ముందు ఢిల్లీ వార్నర్‌ను వదిలేయగా.. వేలంలోనూ అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.
పీఎస్‌ఎల్‌లో అత్యధిక ధర
ఈ క్రమంలో పీఎస్‌ఎల్ వైపు దృష్టి సారించిన వార్నర్.. ఈ పాక్ టీ20 లీగ్‌లో అధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. కరాచీ కింగ్స్ అతడిని రూ. 2.57 కోట్లకు కొనుగోలు చేసి.. కెప్టెన్‌గా నియమించింది. ఇక పీఎస్‌ఎల్ ఏప్రిల్ 11- మే 18 వరకు జరుగనుండగా.. అమెరికా టీ20 లీగ్ MLCని జూన్ 12- జూలై 13 వరకు నిర్వహించనున్నారు.
సీటెల్ ఒర్కాస్‌తో తాజా ఒప్పందం
ఈ నేపథ్యంలో సీటెల్ ఒర్కాస్ వార్నర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఎంత మొత్తానికి అతడి సేవలు వినియోగించుకోబోతోందో మాత్రం వెల్లడించలేదు. కాగా వార్నర్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుతం పీఎస్‌ఎల్‌లో కరాచీ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న వార్నర్.. బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ కెప్టెన్‌గా ఈ ఏడాది జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. అంతేకాదు.. 12 ఇన్నింగ్స్‌లో కలిపి 405 పరుగులతో లీగ్‌లో అత్యధిక వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఐఎల్‌టీ20లో ఈ ఏడాది టైటిల్ గెలిచిన దుబాయ్ క్యాపిటల్స్ జట్టులో వార్నర్ సభ్యుడు. ఇక ది హండ్రెడ్ లీగ్‌లో అతడు లండన్ స్పిరిట్‌కు ఆడుతున్నాడు.
చదవండి: BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం