
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ టీ20ల్లో అత్యంత అరుదైన 13000 పరుగుల క్లబ్‌లో చేరాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో కరాచీ కింగ్స్‌కు ఆడుతున్న వార్నర్.. పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో ఈ మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ (47 బంతుల్లో 60; 8 ఫోర్లు) చేసిన వార్నర్.. పొట్టి క్రికెట్‌లో 13000 పరుగులు పూర్తి చేసిన ఆరో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించిన మూడో ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పాడు. వార్నర్ 403 ఇన్నింగ్స్‌ల్లో 13000 పరుగులు పూర్తి చేశాడు. పొట్టి క్రికెట్‌లో అత్యంత వేగంగా ఈ మార్కును తాకిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ కేవలం 381 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. గేల్ తర్వాత విరాట్ కోహ్లి (386 ఇన్నింగ్స్‌ల్లో) అత్యంత వేగంగా ఈ ఘనతను సాధించాడు.
టీ20ల్లో 13000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు
క్రిస్ గేల్- 14562
అలెక్స్ హేల్స్- 13610
షోయబ్ మాలిక్- 13571
కీరన్ పోలార్డ్- 13537
విరాట్ కోహ్లి- 13208
డేవిడ్ వార్నర్- 13019
టీ20ల్లో అత్యంత వేగంగా 13000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు
క్రిస్ గేల్- 381 ఇన్నింగ్స్‌లు
విరాట్ కోహ్లి- 386
డేవిడ్ వార్నర్- 403
అలెక్స్ హేల్స్- 474
షోయబ్ మాలిక్- 487
కీరన్ పోలార్డ్- 594
కరాచీ కింగ్స్, పెషావర్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ రాణించడంతో పెషావర్ జల్మీపై కరాచీ కింగ్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది.
పెషావర్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (46) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో మహ్మద్ హరీస్ (28), అల్జరీ జోసఫ్ (24 నాటౌట్), తలాత్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. సైమ్ అయూబ్ 4, టామ్ కొహ్లెర్ కాడ్‌మోర్ 7, మిచెల్ ఓవెన్ 5, అబ్దుల్ సమద్ 2, లూక్ వుడ్ 2 పరుగులకు ఔటయ్యారు. కరాచీ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిది, ఖుష్దిల్ షా తలో 3 వికెట్లు తీయగా.. ఆమెర్ జమాల్, మీర్ హమ్జా చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన కరాచీ కూడా ఒక్కో పరుగు సాధించేందుకు చాలా ఇబ్బంది పడింది. అతి కష్టం మీద ఆ జట్టు 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కరాచీ గెలుపుకు ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ (60) గట్టి పునాది వేసినప్పటికీ.. ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు తడబడ్డారు. అయితే చివర్లో ఖుష్దిల్ షా (23 నాటౌట్) సంయమనంతో బ్యాటింగ్ చేసి కరాచీని విజయతీరాలకు చేర్చాడు. పెషావర్ బౌలర్లలో లూక్ వుడ్ 3, అలీ రజా 2, అల్జరీ జోసఫ్, ఆరిఫ్ యాకూబ్ తలో వికెట్ పడగొట్టారు.