అబుదాబీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో (ILT20 2025) దుబాయ్ క్యాపిటల్స్ (Dubai Capitals) వెటరన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ (David Warner) వచ్చీరాగానే తన ప్రతాపం చూపించాడు. ఐఎల్‌టీ20లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన వార్నర్.. అబుదాబీ నైట్‌రైడర్స్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్ (57 బంతుల్లో 93 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్) ఆడి తన జట్టుకు క్వాలిఫయర్స్‌కు చేర్చాడు. తాజాగా ఇన్నింగ్స్‌తో వార్నర్ తనలో ఇంకా చేవ తగ్గలేదని నిరూపించాడు. వార్నర్ మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌పై క్యాపిటల్స్ 26 పరుగుల తేడాతో గెలుపొందింది.
క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో వార్నర్‌తో పాటు షాయ్ హోప్ (24 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), గుల్బదిన్ నైబ్ (25 బంతుల్లో 47; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), దసున్ షనక (12 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది.
షనక చివర్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. చివరి రెండు ఓవర్లలో షనక ఎక్కువ భాగం స్ట్రయిక్ తీసుకుని వార్నర్‌కు బ్యాటింగ్ ఇవ్వలేదు. చివరి రెండు ఓవర్లలో వార్నర్‌కు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చి ఉంటే సెంచరీ పూర్తి చేసుకుని ఉండేవాడు. షనక, వార్నర్ ధాటికి నైట్‌రైడర్స్ బౌలర్ జేసన్ హోల్డర్ 4 ఓవర్లలో ఏకంగా 61 పరుగులు సమర్పించుకున్నాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్, హోల్డర్, సునీల్ నరైన్, ఇబ్రార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.
218 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్ చివరి వరకు పోరాడింది. ఆ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసి లక్ష్యానికి 27 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఓపెనర్లు కైల్ మేయర్స్ (29 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆండ్రియస్ గౌస్ (47 బంతుల్లో 78; 7 ఫోర్లు, 4 సిక్సర్లు).. ఆఖర్లో జేసన్ హోల్డర్ (9 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్సర్లు), సునీల్ నరైన్ (8 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) నైట్‌రైడర్స్‌ను గెలిపించేందుకు శతవిధాల ప్రయత్నించారు. క్యాపిటల్స్ బౌలర్ దుష్మంత చమీరా 19వ ఓవర్‌ను అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ ఓవరే నైట్‌రైడర్స్ విజయావకాశాలపై నీళ్లు చల్లింది.
కాగా, ప్రస్తుత ఐఎల్‌టీ20 ఎడిషన్‌లో దుబాయ్ క్యాపిటల్స్‌తో పాటు డెజర్ట్ వైపర్స్, ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్స్ క్వాలిఫయర్స్‌కు చేరుకున్నాయి. గల్ఫ్ జెయింట్స్, అబుదాబీ నైట్‌రైడర్స్ జట్లు ఎలిమినేట్ అయ్యాయి.
ఉదయం శ్రీలంకలో సెంచరీ.. సాయంత్రం అబుదాబీలో మెరుపు ఇన్నింగ్స్
నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాపిటల్స్ ఆటగాడు దసున్ షనక మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందు షనక కొన్ని మైళ్ల దూరం ప్రయాణించాడు. ఉదయం శ్రీలంకలో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో సెంచరీ బాదిన షనక.. సాయంత్రం నైట్‌రైడర్స్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షనక.. మేజర్ లీగ్ టోర్నమెంట్‌లో భాగంగా సింహలీస్ క్లబ్‌కు ఆడుతూ 87 బంతుల్లో 123 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment