
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సభ్యుడిగా ఉన్న ఆటగాడు దులీప్ ట్రోఫీ-2023లో సూపర్ సెంచరీతో మెరిశాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో నార్త్ జోన్ ఆటగాడు నిశాంత్ సింధు (111 నాటౌట్) అద్భుతమైన శతకం బాదాడు. రెండో రోజు ఆటలో (ఇవాళ) నిశాంత్ సెంచరీ మార్కును అందుకున్నాడు. అంతకుముందు తొలి రోజు ఆటలో ధృవ్ షోరే (135) సెంచరీ చేశాడు. రెండో రోజు తొలి సెషన్ సమయానికి (103 ఓవర్లు) నార్త్ జోన్ 6 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. నిశాంత్‌కు జతగా పుల్కిత్ నారంగ్ (39) క్రీజ్‌లో ఉన్నాడు.
కాగా, ఐపీఎల్-2023 వేలంలో నిశాంత్ సింధును చెన్నై సూపర్ కింగ్స్ 60 లక్షల ధరకు కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్‌లో అతని ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. 2022 అండర్-19 వరల్డ్‌కప్‌లో కనబర్చిన అద్భుతమైన ప్రదర్శన కారణంగా నిశాంత్‌కు ఐపీఎల్ ఆఫర్ వచ్చింది. నాటి వరల్డ్‌కప్ ఫైనల్లో నిషాంత్ వీరోచితంగా పోరాడి హాఫ్ సెంచరీ సాధించాడు. నిషాంత్ దేశవాళీ క్రికెట్‌లో ఇప్పటివరకు 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు (2 సెంచరీలు, 3 అర్ధసెంచరీలు), 7 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 8 టీ20లు ఆడాడు.