
భారత మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగట్(Vinesh Phogat) శుభవార్త చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. భర్త సోమ్‌వీర్ రాఠీ(Somvir Rathee)తో కలిసి తొలి బిడ్డకు స్వాగతం పలుకబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
‘‘మా ప్రేమ కథకు కొనసాగింపు.. సరికొత్త అధ్యాయంతో మొదలు’’ అంటూ చిన్నారి పాదం, లవ్ ఎమోజీలను షేర్ చేస్తూ ఈ క్రీడాకారుల జంట తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.
కాగా భారత స్టార్ రెజ్లర్‌గా పేరొందిన వినేశ్ ఫొగట్ గతేడాది పతాక శీర్షికల్లో నిలిచింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024 ఫైనల్‌కు చేరుకున్న ఈ హర్యానా అథ్లెట్‌పై అనూహ్య రీతిలో ఆఖరి నిమిషంలో వేటు పడింది.
నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు అదనంగా ఉన్నందు వల్ల ఆమెను అనర్హురాలిగా తేల్చారు. దీంతో.. రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం వస్తుందన్న ఆశలు ఆవిరి కాగా.. దేశవ్యాప్తంగా యూడబ్ల్యూడబ్ల్యూ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
అనర్హత వేటు ఎదుర్కోవాల్సిందేనన్న స్పోర్ట్స్ కోర్టు
భారత ఒలింపిక్ సంఘం(IOA), అధికారుల తీరుపైనా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఐఓఏ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)లో అప్పీలు చేయగా నిరాశే ఎదురైంది. ‘‘అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే క్రీడాకారులు నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి’’ అంటూ వినేశ్ అభ్యర్థనను కొట్టిపారేసింది.
‘క్రీడాకారులకు నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలి. బరిలోకి దిగే బరువు కేటగిరీ కంటే ఎక్కువ ఉంటే అనుమతించరు. అది అందరికీ వర్తిస్తుంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు. నిర్ణీత బరువు కంటే ఒక్క గ్రాము ఎక్కువ ఉన్న అనర్హత వేటు ఎదుర్కోవాల్సిందే’’ అని సీఏఎస్ స్పష్టం చేసింది.
ఈ క్రమంలో తొలి రోజు పోటీల్లో నిర్ణీత బరువుతోనే పోటీపడి విజయాలు సాధించినందుకుగానూ... గుజ్‌మన్ లోపెజ్‌తో కలిపి తనకూ రజతం ఇవ్వాలని వినేశ్ న్యాయపోరాటం చేసినా సానుకూల ఫలితం రాలేదు. దీంతో మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో సంచలన విజయాలు సాధించినా వినేశ్ పతకం లేకుండానే దేశానికి తిరిగి వచ్చింది.
రాజకీయాల్లోకి
కాగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో దిగ్గజ రెజ్లర్ యూ సుసూకీపై వినేశ్ సాధించిన విజయం చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అంతేకాదు.. ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరిన తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర పుటల్లో ఆమె పేరు అజరామరంగా ఉంటుంది.
అతడే ఆమెకు సర్వస్వం
ఇక ఈ తీవ్ర నిరాశ అనంతరం.. కుస్తీకి స్వస్తి చెప్పిన వినేశ్ ఫొగట్ రాజకీయాల్లో ప్రవేశించింది. కాంగ్రెస్ పార్టీలో చేరి హర్యానాలోని ఝులన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. కాగా వినేశ్ భర్త సోమ్‌వీర్ కూడా రెజ్లరే. హర్యానాకు చెందిన అతడు.. జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకున్నాడు. వినేశ్, సోమ్‌వీర్ రాఠీ రైల్వేలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు.
అయితే, వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా అనుకున్న లక్ష్యాలు చేరుకునే క్రమంలో వినేశ్‌కు సోమ్‌వీర్ అన్నిరకాలుగా అండగా నిలిచాడు. ఈ క్రమంలో పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్న ఈ క్రీడా జంట 2018లో వివాహం చేసుకున్నారు. ‘బేటీ బచావో.. బేటీ పడావో.. బేటీ ఖిలావో’ అంటూ సప్తపదికి మరో అడుగును జతచేసి పెళ్లినాడు ఎనిమిది అడుగులు వేశారు.
సంబంధిత వార్త : తను లేకుంటే నేను లేను.. వినేశ్‌కు అతడే కొండంత అండ