
నేడు రాజస్తాన్ రాయల్స్‌తో గుజరాత్ టైటాన్స్ పోరు
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్‌లో వరస విజయాలతో జోరు మీదున్న మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్... వరస పరాజయాలతో డీలా పడ్డ రాజస్తాన్ రాయల్స్‌తో పోరుకు సిద్ధమైంది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 2 ఓటములతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకున్న గుజరాత్ ప్లే ఆఫ్స్ వైపు అడుగులు వేస్తుండగా... రాజస్తాన్ 9 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 7 ఓటములతో పట్టికలో కింది స్థానం కోసం పోటీ పడుతోంది.
రాయల్స్ జట్టు ఆడిన చివరి 5 మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌పై గుజరాత్ 58 పరుగుల తేడాతో గెలుపొందింది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ విజయానికి అతి చేరువగా వచ్చిన రాయల్స్... ఆఖర్లో ఒత్తిడికి చిత్తై ప్రత్యర్థికి మ్యాచ్‌లు అప్పగించింది. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ‘సూపర్ ఓవర్’ కూడా ఉంది.
రెగ్యులర్ కెప్టెన్ సంజూ సామ్సన్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా అతడి స్థానంలో రియాన్ పరాగ్ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రాయల్స్... తెగించి పోరాడాలని చూస్తోంది. మరో రెండు విజాయలు సాధిస్తే టైటాన్స్‌కు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కానున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ గుజరాత్‌కు మంచి అవకాశం కానుంది.
తెగించి కొట్లాడితేనే!
ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008)లో చాంపియన్‌గా నిలిచిన రాజస్తాన్ రాయల్స్... ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా రెండోసారి ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయింది. సారథులు, ఆటగాళ్లు, కోచ్‌లు ఎంతమంది మారినా జట్టు రాత మాత్రం మారలేదు. ఈసారి యువ ఆటగాళ్ల బృందంతో బరిలోకి దిగిన రాయల్స్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన వంతు ప్రయత్నం చేస్తున్నా... మిగతా వాళ్ల నుంచి సహకారం లభించడం లేదు.
తాజా సీజన్‌లో 9 మ్యాచ్‌లాడిన జైస్వాల్ 39.56 సగటుతో 356 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధశతకాలు ఉన్నాయి. సంజూ దూరమవడంతో... 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి ఓపెనర్‌గా అవకాశం దక్కుతోంది. అందుకు తగ్గట్లే ఆరంభ మెరుపులు మెరిపిస్తున్న సూర్యవంశీ... ప్రతి బంతికి షాట్ కొట్టాలనే తొందరలో పెవిలియన్ చేరుతున్నాడు.
రియాన్ పరాగ్, నితీశ్ రాణా, ధ్రువ్ జురెల్, శుభమ్ దూబేతో మిడిలార్డర్ పేపర్ మీద బలంగానే కనిపిస్తున్నా... మైదానంలో ప్రదర్శన అంతంత మాత్రమే. వెస్టిండీస్ వీరుడు హెట్‌మైర్ ధాటిగా ఆడటంలో విఫలమవుతున్నాడు. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్, హసరంగ, ఫరూఖీ, సందీప్ శర్మ ప్రభావం చూపలేకపోతున్నారు. ఇక చేసేదేమీ లేని తరుణంలో ఈ మ్యాచ్‌లో జట్టు సమష్టిగా తెగించి పోరాడాలని చూస్తోంది.
ఫుల్ ఫామ్‌లో టాప్–3...
శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్... చక్కటి ఫామ్‌లో ఉంది. బ్యాటింగ్‌లో టాప్–3 ప్లేయర్లు విజృంభిస్తుంటే... బౌలర్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. 8 మ్యాచ్‌ల్లో 52.13 సగటుతో 417 పరుగులు చేసిన సాయి సుదర్శన్ ‘ఆరెంజ్ క్యాప్’ రేసులో ముందు వరుసలో నిలవగా... గతంలో రాజస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన బట్లర్ 71.20 సగటుతో 356 పరుగులు చేశాడు. సారథి గిల్ 43.57 సగటుతో 305 పరుగులతో కొనసాగుతున్నాడు.
ఈ ముగ్గురూ 150కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో ఈ పరుగులు సాధించడం మరో విశేషం. మిడిలార్డర్‌లో షారుక్ ఖాన్, రూథర్‌ఫర్డ్, రాహుల్ తెవాటియా కీలకం కానున్నారు. ఇక దక్షిణాఫ్రికా పేసర్ రబడ లీగ్ మధ్యలో వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరుగు పయనమవడంతో... గుజరాత్ బౌలింగ్ బలహీన పడుతుందని భావిస్తే... విభిన్న కూర్పుతో మరింత రాటుదేలింది.
గాయాల కారణంగా చాన్నాళ్లుగా లైమ్‌లైట్‌లో లేని ప్రసిధ్ కృష్ణ... 8 మ్యాచ్‌ల్లో 16 వికెట్లతో ‘పర్పుల్ క్యాప్’ రేసులో దూసుకెళ్తున్నాడు. హైదరాబాదీ పేసర్ సిరాజ్, సాయి కిషోర్ చెరో 12 వికెట్లు పడగొట్టి మంచి టచ్‌లో ఉన్నారు. వీరంతా మరోసారి విజృంభిస్తే... గుజరాత్ టైటాన్స్ జట్టు ‘ప్లే ఆఫ్స్’కు మరింత చేరువ కావడం ఖాయమే!
తుది జట్లు (అంచనా)
రాజస్తాన్ రాయల్స్: రియాన్ పరాగ్ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీశ్ రాణా, ధ్రువ్ జురెల్, హెట్‌మైర్, శుభమ్ దూబే, ఆర్చర్, హసరంగ, తుషార్ దేశ్‌పాండే, ఫజల్‌హక్ ఫరూఖీ, సందీప్ శర్మ.
గుజరాత్ టైటాన్స్: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్ ), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రూథర్‌ఫార్డ్, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సాయి కిషోర్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ,