
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ జూలు విధిల్చింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ను 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ చిత్తు చేసింది. ఈ విజయంతో రాజస్తాన్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5 ఓవర్లలో చేధించింది.
రాజస్తాన్ బ్యాటర్లలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 35 బంతుల్లోనే తొలి ఐపీఎల్ సెంచరీని అందుకున్నాడు. ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా 14 ఏళ్ల వైభవ్ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు యశస్వి జైశ్వాల్(40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70 నాటౌట్) సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ప్రసిద్ద్, రషీద్ ఖాన్ మాత్రమే చెరో వికెట్ సాధించారు.
గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్ మరోసారి తన బ్యాట్‌కు పని చెప్పాడు. 50 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84 పరుగులు చేసి గిల్ ఔటయ్యాడు. అతడితో పాటు బట్లర్(50), సాయిసుదర్శన్(39) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో థీక్షణ రెండు, అర్చర్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు.