
వైజాగ్ టెస్ట్‌లో టీమిండియా ఇంగ్లండ్ ముందు 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు తొలి సెషన్‌లో ఇంగ్లండ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు జో రూట్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. స్లిప్‌లో క్యాచ్ అందుకనే క్రమంలో రూట్ కుడిచేతి చిటికెన వేలుకు గాయమైంది. దీంతో హుటాహూటిన అతన్ని డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు.
రూట్ ప్రస్తుతం ఇంగ్లండ్ మెడికల్ టీమ్ పర్యవేక్షనలో ఉన్నాడు. అతనికి ఐస్ ట్రీట్‌మెంట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రూట్ గాయం తీవ్రత ఏంటనేది తెలియాల్సి ఉంది. 399 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రూట్ బరిలోకి దిగకపోతే ఇంగ్లండ్ విజయావకాశాలు దెబ్బతినవచ్చు. మిడిలార్డర్‌లో రూట్ కీలకమైన ప్లేయర్. భారత్ సెకెండ్ ఇన్నింగ్స్ అనంతరం ఇంగ్లండ్ లక్ష్య ఛేదనకు దిగింది. ఆ జట్టు 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. ముకేశ్ కుమార్ వేసిన రెండో ఓవర్‌లో బెన్ డకెట్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు.
భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (104) సెంచరీతో కదంతొక్కగా.. అక్షర్ పటేల్ (45) పర్వాలేదనిపించాడు. రోహిత్ (13), శ్రేయస్ (29), కేఎస్ భరత్ (6) మరోసారి విఫలం కాగా.. తొలి ఇన్నింగ్స్ సెన్సేషన్, డబుల్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ 17 పరుగులు చేసి ఔటయ్యాడు. అరంగేట్రం ఆటగాడు రజత్ పాటిదార్ 9 వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యాడు. ఆఖర్లో అశ్విన్ 29 పరుగులు చేసి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ చేసేందుకు తోడ్పడ్డాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి 209 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. బుమ్రా (6/45), కుల్దీప్ (3/71) ధాటికి 253 పరుగులకే ఆలౌటైంది.