
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి గానూ విజ్డెన్ మెన్స్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్ అవార్డుకు ఎంపికయ్యాడు. గతేడాది ఫార్మాట్లకతీతంగా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గానూ బుమ్రాకు ఈ గౌరవం దక్కింది.
2024లో బుమ్రా మూడు ఫార్మాట్లలో 86 వికెట్లు (21 మ్యాచ్‌ల్లో 13 సగటున) తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. గతేడాది బుమ్రా టెస్ట్‌ల్లో విశేషంగా రాణించి అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఫలితంగా అతను ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, బీసీసీఐ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు గెలుచుకున్నాడు.
గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో అద్భుతంగా రాణించిన బుమ్రా భారత్‌కు టైటిల్‌ను అందించడంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుతో పాటు రెండు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు.
దిగ్గజాల సరసన చోటు
తాజాగా విజ్డెన్ మెన్స్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్ అవార్డు గెలవడంతో బుమ్రా భారత దిగ్గజ క్రికెటర్ల సరసన చేరాడు. గతంలో విరాట్ కోహ్లి, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ మాత్రమే ఈ అవార్డును గెలుచుకున్నారు. వీరిలో కోహ్లి అత్యధికంగా 3 సార్లు ఈ అవార్డును గెలువగా.. సెహ్వాగ్ 2, సచిన్ ఓసారి ఈ అవార్డును దక్కించుకున్నారు.
విజ్డెన్ వుమెన్స్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్ అవార్డు విషయానికొస్తే.. 2024 సంవత్సరానికి గానూ ఈ అవార్డును భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధన దక్కించకుంది. మంధన గతేడాది మూడు ఫార్మాట్లలో విశేషంగా రాణించి, రికార్డు స్థాయిలో 1659 పరుగులు చేసింది. మహిళల క్రికెట్‌లో ఓ క్యాలెండర్ ఇయర్‌లో ఇన్ని పరుగులు ఎవరూ చేయలేదు. గతేడాది మంధన నాలుగు వన్డే శతకాలు, ఓ టెస్ట్ సెంచరీ సాధించింది.
పూరన్‌కు లీడింగ్ టీ20 ప్లేయర్ అవార్డు
పొట్టి క్రికెట్‌లో విశేషంగా రాణిస్తున్న విండీస్ ఆటగాడు నికోలస్ పూరన్‌కు విజ్డెన్ మెన్స్ లీడింగ్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద వరల్డ్ అవార్డు లభించింది. పూరన్ గతేడాది పొట్టి ఫార్మాట్‌లో 21 మ్యాచ్‌లు ఆడి 142.22 స్ట్రయిక్‌రేట్‌తో 464 పరుగులు చేశాడు.