
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్‌తో సంబంధాలన్నీ తెంచుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి సూచించాడు. కాగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు మంగళవారం పాశవిక దాడికి తెగబడిన విషయం తెలిసిందే.
ప్రశాంతమైన బైసరన్ లోయలో 26 మంది పర్యాటకులను లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ క్రమంలో భారత్- పాక్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. 2008 తర్వాత టీమిండియా ఒక్కసారి కూడా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పాక్ 2013లో భారత పర్యటనకు వచ్చింది.
అనంతరం దాయాది దేశాల పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయాయి. అయితే, ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్ టోర్నీల్లో మాత్రం భారత్- పాక్ (Ind vs Pak) ముఖాముఖి తలపడుతున్నాయి. కానీ తాజాగా పహల్గామ్ ఘటన నేపథ్యంలో సంబంధాలు పూర్తిగా తెగిపోయే పరిస్థితి వచ్చింది.
సంబంధాలు తెంచుకోవాలి
ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘అవును.. వందకు వంద శాతం పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలు తెంచుకోవాలి. కఠిన చర్యలు చేపట్టాలి. ప్రతి ఏడాది ఇలాంటి ఘటనలు జరగడాన్ని తేలికగా తీసుకోవద్దు. ఇదేమీ జోక్ కాదు. ఉగ్రవాదాన్ని సహించకూడదు. టెర్రరిజంను తుడిచిపెట్టేయాలి’’ అని పేర్కొన్నాడు.
ఇక బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇప్పటికే పాక్‌తో భవిష్యత్తులోనూ ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండబోవని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఐసీసీ నిబంధనలకు అనుగుణంగా ప్రస్తుతం దాయాదితో ఆడుతున్నామని.. అయితే, పరిస్థితులన్నింటినీ ఐసీసీ కూడా గమనిస్తోందని తెలిపారు. భారత ప్రభుత్వం చెప్పినట్లే తాము నడుచుకుంటామని స్పష్టం చేశారు.
ముక్తకంఠంతో ఖండించిన క్రీడా లోకం
కాగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను భారత క్రీడా లోకం ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. ‘‘బాధిత కుటుంబాలు ఊహించలేని కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఈ కష్టకాలంలో భారత్‌తో పాటు యావత్ ప్రపంచం వారికి అండగా నిలుస్తోంది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తేలియజేస్తున్నా. న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నా’’ అని టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు.
ఇక విరాట్ కోహ్లి సైతం.. ‘‘ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు శాంతి, బలం చేకూరాలని ప్రార్థిస్తున్నా. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నా. ఇలాంటి క్రూరమైన చర్యకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు.
మరోవైపు.. ‘‘అమాయకులైన పర్యాటకులపై దాడి హేయమైన చర్య. దీనికి రాబోయే కాలంలో మన ధైర్యవంతమైన సైనికులు గట్టి బదులిస్తారు. జమ్మూకశ్మీర్‌లో శాంతికి భంగం కలగించాలనుకునే వారి ప్రణాళికలు ఎప్పటికీ విజయవంతం కావు’’ అని బాక్సర్ విజేందర్ సింగ్ తన స్పందన తెలియజేశాడు.
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు స్పందిస్తూ.. ‘‘పహల్గామ్ ఉగ్ర దాడి బాధితుల కోసం నా హృదయం తపిస్తోంది. ఎలాంటి కారణమైనా.. ఇంత క్రూరత్వాన్ని సమర్థించదు. బాధితుల దుఖం మాటల్లో చెప్పలేనిది. కానీ వారు ఒంటరి వారు కాదు. వారి వెంట యావత్ దేశం ఉంది. క్లిష్ట సమయంలో ఒకరికొకరు అండగా నిలుద్దాం. శాంతి పునరుద్ధరణ తప్పక జరుగుతుంది’’ అని పేర్కొంది.
చదవండి: PSL 2025 Live Suspended: పాకిస్తాన్‌కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..