
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో ఘన విజయాన్ని గుజరాత్ అందుకుంది. 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగల్గింది.
కేకేఆర్ బ్యాటర్లలో కెప్టెన్ అజింక్య రహానే(50)టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో రఘువన్షి(27) పర్వాలేదన్పించాడు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ట తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, సుందర్, ఇషాంత్ శర్మ సాయికిషోర్ చెరో వికెట్ పడగొట్టారు.
చితక్కొట్టిన శుబ్‌మన్..
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ విధ్వంసం సృష్టించాడు. తన సూపర్ బ్యాటింగ్‌తో ఈడెన్‌లో బౌండరీలు వర్షం కురిపించాడు.
55 బంతులు ఎదుర్కొన్న గిల్.. 10 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 90 పరుగులు చేశాడు. గిల్‌తో పాటు సాయిసుదర్శన్(52), బట్లర్(41) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా, రస్సెల్ తలా వికెట్ సాధించారు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ 6 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.