
India vs England, 4th Test- Rinku Singh's Emotional Post: టీమిండియా యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. దురదృష్టవశాత్తూ సెంచరీకి పది పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
అయితేనేం.. అతడు సాధించిన ఆ 90 పరుగులు భారత ఇన్నింగ్స్‌లో అత్యంత ముఖ్యమైనవి. టీమిండియా 307 పరుగులు మార్కును అందుకుందంటే అందుకు జురెలే కారణం. ముఖ్యంగా మూడో రోజు ఆటలో భాగంగా కుల్దీప్ యాదవ్(28)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 76 విలువైన పరుగులు జోడించిన తీరు అద్భుతం.
అలా తొలి ఇన్నింగ్స్‌లో 149 బంతులు ఎదుర్కొన్న ధ్రువ్ జురెల్.. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసి కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా నయా సంచలనం రింకూ సింగ్.. జురెల్‌ను ఉద్దేశించి ఉద్వేగపూరిత నోట్ రాశాడు.
జురెల్‌తో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంటూ.. ‘‘నా సహోదరుడా... కలలు నిజమయ్యే తరుణం ఇది’’ అంటూ సహచర ఆటగాడిపై ప్రేమను కురిపించాడు. కాగా రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ దేశవాళీ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్‌కు ఆడతారన్న విషయం తెలిసిందే. అలా పరిచయమైన వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.
ఇదిలా ఉంటే.. మాజీ క్రికెటర్లు వసీం జాఫర్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు ధ్రువ్ జురెల్ నైపుణ్యాలను కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపాడు. ఇక ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన ధ్రువ్ జురెల్.. రాంచి మ్యాచ్‌లో తాను సాధించిన విలువైన అర్ధ శతకాన్ని తన తండ్రికి అంకితమిచ్చాడు.
మరోవైపు.. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో అద్బుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న రింకూ సింగ్.. గతేడాది టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. టీ20 ఫార్మాట్లో నయా ఫినిషర్‌గా అవతరించిన ఈ యూపీ బ్యాటర్.. వన్డేల్లోనూ తనదైన ముద్ర వేయాలని పట్టుదలగా ఉన్నాడు.
చదవండి: ఏంటి సర్ఫరాజ్.. హీరో అవ్వాలనుకుంటున్నావా? రోహిత్ సీరియస్!