
భువీ, నట్టుతో కమిన్స్ (PC: SRH X)
సన్‌రైజర్స్ హైదరాబాద్- రాజస్తాన్ రాయల్స్ మధ్య గురువారం నాటి మ్యాచ్ ప్రేక్షకులను మునివేళ్ల మీద నిలబెట్టింది. నువ్వా- నేనా అన్నట్లుగా ఆఖరి బంతి వరకు సాగిన ఈ ఉత్కంఠ పోరు అసలైన టీ20 మజాను అందించింది.
ఈ హోరాహోరీ పోరులో రాయల్స్‌పై సన్‌రైజర్స్ పైచేయి సాధించి సొంతగడ్డపై గెలుపు జెండా ఎగురవేసింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాలు అంబరాన్నంటాయి.
ఇక గత రెండు మ్యాచ్‌లలో పరాజయాలు చవిచూసి ఎట్టకేలకు మళ్లీ గెలుపు బాట పట్టడంతో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సైతం హర్షం వ్యక్తం చేశాడు.
అసలైన టీ20 క్రికెట్ అంటే ఇదే
టేబుల్ టాపర్ రాజస్తాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లపై కమిన్స్ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన మ్యాచ్ ఇది.
అసలైన టీ20 క్రికెట్ అంటే ఇదే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఆఖరి బంతిని సంధించేపుడు భువీ తన ప్రణాళికను పక్కాగా అమలు చేశాడు.
మిడిల్ ఓవర్లలో వీలైనన్ని వికెట్లు తీసేందుకు ప్రయత్నించాం. అదృష్టవశాత్తూ ఆఖరి వరకు పోరాడగలిగాం. ఇక నటరాజన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. యార్కర్లు సంధించడంలో అతడు దిట్ట.
ఉప్పల్‌లో మేము ఇప్పటికే చాలా మ్యాచ్‌లు ఆడాం. కాబట్టి 200 లక్ష్యమనేది ఛేదించగలిగే టార్గెట్ అని తెలుసు. అయితే, విజయం మమ్మల్ని వరించింది.
అతడొక అద్భుతం అంతే
ఈరోజు నితీశ్ రెడ్డి పరిస్థితులను అర్థం చేసుకుని చక్కగా ఆడాడు. అతడొక అద్భుతం అంతే! ఫీల్డింగ్‌లోనూ రాణిస్తున్నాడు. బౌలర్‌గానూ తన వంతు సేవలు అందిస్తున్నాడు’’ అంటూ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి, పేసర్లు భువనేశ్వర్ కుమార్, నటరాజన్‌ల ఆట తీరును ప్యాట్ కమిన్స్ కొనియాడాడు.
కాగా ఉప్పల్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్(44 బంతుల్లో 58) శుభారంభం అందించగా.. నాలుగో స్థానంలో వచ్చిన నితీశ్ రెడ్డి దుమ్ములేపాడు.
42 బంతులు ఎదుర్కొన్న ఈ యువ ఆటగాడు 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్ల పాటు ఏకంగా 8 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక విధ్వంసకర వీరుడు హెన్రిచ్ క్లాసెన్ మరోసారి తన బ్యాట్ పవర్ చూపించాడు.
కేవలం 19 బంతుల్లోనే 42 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ కేవలం 3 వికెట్ల నష్టపోయి 201 పరుగులు సాధించింది.
లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్‌ను భువీ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్ జోస్ బట్లర్(0), వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్(3)ను డకౌట్ చేశాడు.
ఇక 40 బంతుల్లో 67 పరుగులతో ప్రమాదకరంగా మారుతున్న యశస్వి జైస్వాల్ వికెట్‌ను నటరాజన్ తన ఖాతాలో వేసుకోగా.. టాప్ స్కోరర్ రియాన్ పరాగ్(77)ను కమిన్స్ పెవిలియన్‌కు పంపాడు.
నరాలు తెగే ఉత్కంఠ
ఈ క్రమంలో చివరి 3 ఓవర్లలో రాయల్స్ విజయ సమీకరణం 27 పరుగులుగా మారగా.. అప్పటికి చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాయల్స్ సునాయాసంగానే లక్ష్యాన్ని ఛేదిస్తుందని అంతా భావించారు.
అయితే, రైజర్స్ పేసర్లు అంతా తలకిందులు చేశారు. 18వ ఓవర్లో నటరాజన్, 19వ ఓవర్లో కమిన్స్ తలా కేవలం ఏడు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. చివరి ఓవర్లో సమీకరణం 13 పరుగులు మారింది.
అప్పుడు బంతిని అందుకున్న భువీ బౌలింగ్‌లో తొలి ఐదు బంతుల్లో 11 పరుగులు వచ్చాయి. చివరి బంతికి 2 పరుగులు అవసరమైన వేళ రోవ్‌మన్ పావెల్‌ను భువీ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో రైజర్స్ ఊపిరి పీల్చుకుంది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో గట్టెక్కింది. భువీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
Jumps of Joy in Hyderabad 🥳
Terrific turn of events from @SunRisers' bowlers as they pull off a nail-biting win 🧡
Scorecard ▶️ https://t.co/zRmPoMjvsd #TATAIPL | #SRHvRR pic.twitter.com/qMDgjkJ4tc— IndianPremierLeague (@IPL) May 2, 2024