
PC: BCCI/IPL.com
టీమిండియా వెటరన్, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కరుణ్ నాయర్ తన ఐపీఎల్ పునరగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరుణ్ నాయర్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన కరుణ్ నాయర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన కరుణ్.. నాయర్ ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. క్రీజులో ఉన్నంత సేపు నాయర్ బౌండరీల వర్షం కురిపించాడు. మైదానం నలుమూలల బౌండరీలు కొడుతూ అభిమానులను అలరించాడు.
వరల్డ్ క్లాస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను సైతం అతడు ఊతికారేశాడు. ఓ దశలో సెంచరీ చేసేలా కన్పించిన కరుణ్ నాయర్.. మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఓవరాల్‌గా 40 బంతులు ఎదుర్కొన్న కరుణ్ నాయర్.. 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.
ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా నాయర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా కరుణ్ నాయర్‌కు ఇది ఏడేళ్ల తర్వాత వచ్చిన హాఫ్ సెంచరీ కావడం విశేషం. అయితే ఈ మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ 12 పరుగుల తేడాతో ఢిల్లీ ఓటమి పాలైంది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది.