
Photo Courtesy: BCCI
ఆర్సీబీతో జరిగిన సీజన్ ఓపెనర్‌లో (IPL 2025) డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ ఓటమి చవి చూసింది. సొంత మైదానంలో (ఈడెన్ గార్డెన్స్) జరిగిన మ్యాచ్ అయినా కేకేఆర్‌కు పరాభవం తప్పలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. నరైన్ (26 బంతుల్లో 44; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), రహానే (31 బంతుల్లో 56; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో భారీ స్కోర్ చేసేలా కనిపించింది.
అయితే 10 ఓవర్ తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. మూడు బంతుల వ్యవధిలో నరైన్, రహానే ఔటయ్యారు. దీంతో పరుగులు రావడం చాలా కష్టమైంది. ఈ దశలో ఆర్సీబీ స్పిన్నర్లు రెచ్చిపోయారు. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. ఫలితంగా 200 దాటుతుందనుకున్న కేకేఆర్ స్కోర్ 174 పరుగులకే పరిమితమైంది.
ఛేదనలో ఆర్సీబీకి ఫిల్ సాల్ట్ (31 బంతుల్లో 56; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (36 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్నందించారు. వీరిద్దరూ పవర్ ప్లేలో 80 పరుగులు చేసి కేకేఆర్ చేతిలో నుంచి మ్యాచ్‌ను అప్పుడే లాగేసుకున్నారు.
సాల్ట్, కోహ్లితో పాటు పాటిదార్ (16 బంతుల్లో 34; 5 ఫోర్లు, సిక్స్) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఆర్సీబీ మరో 22 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ఆర్సీబీ గెలుపులో బౌలర్లు ప్రధాన పాత్ర పోషించారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కృనాల్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.
హాజిల్‌వుడ్ సామర్థ్యం మేరకు రాణించి 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. యశ్ దయాల్ (3-0-25-1) పర్వాలేదనిపించాడు. సుయాశ్ శర్మ, రసిక్ సలామ్ తలో వికెట్ తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
ఓటమి అనంతరం కేకేఆర్ కెప్టెన్ రహానే ఇలా అన్నాడు. 13వ ఓవర్ వరకు మంచి స్కోర్ సాధిస్తామని అనుకున్నాను. కానీ ఆ దశలో వికెట్లు కోల్పోవడంతో తామనుకున్నది జరగలేదు. వరుస క్రమాల్లో వికెట్లు కోల్పోవడం తమ జోరుకు అడ్డుకట్ట వేసింది. నా తర్వాత (ఇన్నింగ్స్‌లో) వచ్చిన బ్యాటర్లు వారి శక్తి మేరకు ప్రయత్నించినప్పటికీ వర్కౌట్ కాలేదు.
నేను, వెంకీ (అయ్యర్) బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 200-210 పరుగులు సాధించవచ్చని చర్చించుకున్నాం. కానీ వరుస వికెట్లు తమ జోరును నీరుగార్చాయి. పవర్ ప్లేలో సాల్ట్, కోహ్లి అద్భుతంగా ఆడారు. అప్పుడే మ్యాచ్ మా నుంచి చేజారింది. మంచు కూడా వారి గెలుపుకు సహకరించింది.
200 పైబడిన స్కోర్ చేసుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఓవరాల్‌గా క్రెడిట్ ఆర్సీబీ ఆటగాళ్లకు దక్కుతుంది. కీలక దశలో తమను కట్టడి చేయడంతో పాటు పవర్ ప్లేలో వారి బ్యాటింగ్ అద్భుతంగా ఉండింది. ఈ మ్యాచ్ గురించి ఇంకా డిస్కస్ చేయాలని అనుకోవడం లేదు. కొన్ని అంశాల్లో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు.
కాగా, కేకేఆర్ కెప్టెన్‌గా రహానేకు ఇది తొలి మ్యాచ్. తొలి మ్యాచ్‌లోనే ఓటమితో రహానే కాసింత నిరాశకు లోనైనట్లు కనిపించాడు. వ్యక్తిగతంగా అతను రాణించినా కేకేఆర్‌కు అది వర్కౌట్ కాలేదు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలింగ్ చాలా బలహీనంగా కనిపించింది. ఆర్సీబీ బ్యాటర్ల ముందు వారు తేలిపోయారు.
ముఖ్యంగా వారి జట్టులో ఒక్క అనుభవజ్ఞుడైన పేసర్ కూడా లేడు. ఈ లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది. గత సీజన్‌లో కేకేఆర్ విజయాల్లో పేసర్లు ప్రధాన పాత్ర పోషించారు. కానీ ఈ సీజన్‌లో ఆ జట్టు పేసర్లను కాకుండా స్పిన్నర్లనే ఎక్కువ నమ్ముకుంది. మరి స్పిన్నర్లు కేకేఆర్‌ను టైటిల్ నిలబెట్టుకునేలా చేస్తారో లేదో వేచి చూడాలి.
కాగా, ఈ సీజన్‌లో కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్‌ను మార్చి 26న ఆడుతుంది. గౌహతి వేదికగా నాడు జరిగే మ్యాచ్‌లో కేకేఆర్ రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొంటుంది.