
Photo Courtesy: BCCI
పరుగుల యంత్రం విరాట్ కోహ్లి మరో భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కోహ్లి.. ఐపీఎల్‌లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్‌లో విరాట్ ఇప్పటివరకు 67 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో రెండో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ 66 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 62 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి.
ఐపీఎల్‌లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన టాప్-5 బ్యాటర్స్..
విరాట్- 67 (59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు)
వార్నర్- 66 (62, 4)
శిఖర్ ధవన్- 53 (51, 2)
రోహిత్ శర్మ- 45 (43, 2)
కేఎల్ రాహుల్- 43 (39, 4)
ఏబీ డివిలియర్స్- 43 (40, 3)
మ్యాచ్ విషయానికొస్తే.. ముల్లాన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా.. ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
విరాట్ అజేయ అర్ద శతకంతో (73) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. జితేశ్ శర్మ (11) సిక్సర్ బాది మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో దేవ్‌దత్ పడిక్కల్ (61) మెరుపు అర్ద సెంచరీ చేయగా.. సాల్ట్ (1), రజత్ పాటిదార్ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, హర్ప్రీత్ బ్రార్, చహల్ తలో వికెట్ పడగొట్టారు.
పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (33) టాప్ స్కోరర్‌గా కాగా.. ప్రియాన్ష్ ఆర్య 22, శ్రేయస్ అయ్యర్ 6, జోస్ ఇంగ్లిస్ 29, నేహల్ వధేరా 5, స్టోయినిస్ 1, శశాంక్ సింగ్ 31 (నాటౌట్), జన్సెన్ 25 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీ
ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఆర్సీబీ గత మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇరు జట్ల మధ్య రెండు రోజుల కిందటే బెంగళూరు వేదికగా మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ ఆర్సీబీని చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పంజాబ్‌ను కిందికి దించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ, పంజాబ్, లక్నో తలో 10 పాయింట్లతో టాప్-5లో ఉన్నాయి.