
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్(Ishan Kishan)ను ఉద్దేశించి భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండు ప్రపంచకప్ టోర్నీలు ఆడిన అతడిని అందరూ త్వరగానే మర్చిపోయామన్నాడు. ఇప్పట్లో ఇషాన్ టీమిండియా తరఫున పునరాగమనం చేసే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డాడు.
కాగా 2023లో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అకస్మాత్తుగా స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్.. మేనేజ్‌మెంట్ ఆగ్రహానికి గురయ్యాడు. తిరిగి జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆదేశాలను పెడచెవిన పెట్టాడు. నాటి హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచనలను కూడా లెక్కచేయక మొండిగా వ్యవహరించాడు.
సెంట్రల్ కాంట్రాక్టు పాయె!
ఈ క్రమంలో బీసీసీఐ ఇషాన్ కిషన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి అతడిని తప్పించింది. దీంతో దిగొచ్చిన ఇషాన్ తన సొంతజట్టు జార్ఖండ్ తరఫున దేశీ క్రికెట్ బరిలో దిగాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.
వికెట్ కీపర్ల కోటాలో టీ20 ఫార్మాట్లో సంజూ శాంసన్(Sanju Samson) ముందుకు దూసుకురాగా.. టెస్టుల్లో రిషభ్ పంత్‌తో కలిసి ధ్రువ్ జురెల్ పాతుకుపోయాడు. ఇక వన్డేల్లో సీనియర్ కేఎల్ రాహుల్ ఉండనే ఉన్నాడు. ఈ క్రమంలో రీఎంట్రీ కోసం ప్రయత్నించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు వరుసగా ఎదురుదెబ్బలే తగిలాయి.
ప్రపంచకప్‌లో ఆడినా..
వన్డే ప్రపంచకప్-2023 జట్టులో కేఎల్ రాహుల్‌తో పాటు ఇషాన్‌ను ఎంపిక చేసినా.. అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 టీమ్‌లో మాత్రం రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లకు బీసీసీఐ మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. ఇక తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సంజూ- జురెల్‌లను ఎంపిక చేసిన బోర్డు.. వన్డేలకు రాహుల్- పంత్‌లను ఎంచుకుంది.
అదే విధంగా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులోనూ కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లకే వికెట్ కీపర్ కోటాలో చోటిచ్చింది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్‌కు మద్దతుగా ఉండే కొంతమంది నెటిజన్లు.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడిని ఎందుకు ఆడించడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ విషయమై ఆకాశ్ చోప్రాను స్పందించాల్సిందిగా కోరారు.
డబుల్ సెంచరీ కూడా చేశాడు.. కానీ
ఇందుకు బదులిస్తూ.. ‘‘ఇషాన్ కిషన్.. అతడిని మనం ఇంతత్వరగా మర్చిపోవడం ఆసక్తికరమే!.. మళ్లీ అతడిని గుర్తు కూడా చేసుకోవడం లేదు. అతడు టీమిండియా తరఫున రెండు ప్రపంచకప్ టోర్నీలు ఆడాడు. దుబాయ్‌లో టీ20 ప్రపంచకప్.. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ ఆడాడు. వన్డేల్లో అతడి పేరిట డబుల్ సెంచరీ కూడా ఉంది.
కాకపోతే అతడు చేసిన తప్పు ఇప్పటికీ వెంటాడుతోంది. ఫస్ల్ క్లాస్ క్రికెట్ ఆడటం ఇష్టం లేదనే సందేశం ఇచ్చాడు. అయితే, సెలక్టర్లకు ఇది నచ్చలేదు. అందుకే బీసీసీఐ అతడి ప్రాధాన్యం తగ్గించింది. ఇప్పట్లో సెలక్టర్లు మళ్లీ అతడిని కనికరించకపోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్‌లో గనుక సత్తా చాటితే
ఏదేమైనా ప్రస్తుతం ధ్రువ్ జురెల్‌తో పోటీలో ఇషాన్ కిషన్ వెనుకబడి పోయాడన్న ఆకాశ్ చోప్రా.. జట్టులో చోటు కోసం మరికొంత కాలం ఓపికగా ఎదురుచూడక తప్పదని పేర్కొన్నాడు. సెలక్టర్లు అతడి గత ప్రదర్శనలు పరిగణనలోకి తీసుకోవడం లేదని.. ఈసారి ఐపీఎల్‌లో గనుక సత్తా చాటితే పరిస్థితి మారవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ. 11.25 కోట్లకు ఇషాన్ కిషన్‌ను కొనుగోలు చేసింది.
చదవండి: CT 2025: బుమ్రా, కోహ్లి కాదు!.. టీమిండియా ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అతడే: డివిలియర్స్