
సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య రెండో టెస్టు సందర్భంగా వియాన్ ముల్దర్(Wiaan Mulder)- బాబర్ ఆజం(Babar Azam) మధ్య వాగ్వాదం జరిగింది. తన పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు బాబర్ వియాన్ ముల్దర్ వైపునకు దూసుకువచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ ముదరగా.. ఫీల్డ్ అంపైర్ జోక్యం చేసుకుని ఇరువురికి నచ్చజెప్పాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మిశ్రమ ఫలితాలు
కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ జరుగగా.. ఆతిథ్య జట్టు 2-0తో నెగ్గింది. అనంతరం వన్డే సిరీస్‌లో మాత్రం పర్యాటక పాకిస్తాన్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. చరిత్రలోనూ ఎన్నడూ లేనివిధంగా.. సౌతాఫ్రికా గడ్డపై 3-0తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.
అరుదైన ఘనత
తద్వారా ప్రొటిస్ దేశంలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి జట్టుగా మహ్మద్ రిజ్వాన్ బృందం నిలిచింది. అయితే, టెస్టు సిరీస్‌లో మాత్రం పాకిస్తాన్ జట్టు తడబడుతోంది. సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో రెండు వికెట్ల తేడాతో షాన్ మసూద్ బృందం ఓటమిపాలైంది. ఇక శుక్రవారం మొదలైన రెండో టెస్టులోనూ కష్టాల్లో కూరుకుపోయింది.
రెకెల్టన్ భారీ డబుల్ సెంచరీ
కేప్‌టౌన్‌లో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రియాన్ రెకెల్టన్ భారీ డబుల్ సెంచరీ(259)తో విరుచుకుపడగా.. కెప్టెన్ తెంబా బవుమా(106), వికెట్ కీపర్ బ్యాటర్ వెరియెన్నె(100) కూడా శతక్కొట్టారు. మార్కో జాన్సెన్(62) అర్ధ శతకంతో రాణించగా.. కేశవ్ మహరాజ్ తన వంతుగా 40 పరుగులు సాధించాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఏకంగా 615 పరుగులు స్కోరు చేసింది.
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 194 పరుగులకే కుప్పకూలింది. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజం 58 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 46 పరుగులు చేశాడు. ప్రొటిస్ బౌలర్లలో రబడ మూడు వికెట్లు తీయగా.. క్వెనా మఫాకా, కేశవ్ మహరాజ్ చెరో రెండు, మార్కో జాన్సెన్, వియాన్ ముల్దర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
షాన్ మసూద్ శతకం.. సెంచరీ మిస్ అయిన బాబర్ ఆజం
ఈ నేపథ్యంలో.. మొదటి ఇన్నింగ్స్‌లో 200కు పైగా ఆధిక్యం సంపాదించిన సౌతాఫ్రికా పాకిస్తాన్‌ను ఫాలో ఆన్ ఆడిస్తోంది. దీంతో వెంటనే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పాక్ జట్టు శుభారంభం చేయగలిగింది.
కెప్టెన్ షాన్ మసూద్ సెంచరీ(145)తో చెలరేగగా.. బాబర్ ఆజం కూడా శతకం దిశగా పయనించాడు. అయితే, సోమవారం నాటి ఆటలో భాగంగా 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. జాన్సెన్ బౌలింగ్‌లో బెడింగ్‌హామ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
అయితే, అంతకంటే ముందు అంటే.. ఆదివారం నాటి ఆటలో భాగంగా బాబర్ ఆజం- ప్రొటిస్ పేసర్ వియాన్ ముల్దర్ మధ్య గొడవ జరింది. తన బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి బాబర్ విఫలం కాగా.. ముల్దర్ బంతిని చేజిక్కించుకుని బ్యాటర్ వైపు బలంగా విసిరాడు.
సౌతాఫ్రికా పేసర్ దూకుడు.. ఉరిమి చూసిన బాబర్ ఆజం
అప్పటికే ప్రమాదాన్ని పసిగట్టిన బాబర్ ఆజం వికెట్లకు కాస్త దూరంగానే ఉన్నా బంతి అతడికి తాకింది. దీంతో బాబర్ కోపోద్రిక్తుడై.. చూసుకోవా అన్నట్లుగా ముల్దర్‌వైపు ఉరిమి చూశాడు.
అయితే, అతడు కూడా ఏమాత్రం తగ్గకుండా బాబర్‌ను చూస్తూ దూకుడుగా మాట్లాడాడు. దీంతో గొడవ పెద్దదయ్యే సూచన కనిపించగా అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరినీ సముదాయించాడు. ఇక ఈ మ్యాచ్‌లో 352 పరుగులకు సగం వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్.. ఓటమి నుంచి తప్పించుకునేందుకు పోరాడుతోంది.
Fight moment between Babar Azam and Wiaan Mulder. 🥵
Wiaan Mulder unnecessary throws the ball at Babar Azam & showing him verbal aggression. #BabarAzam𓃵 #PAKvsSA #SAvPAK pic.twitter.com/PZnPNTWELZ— Ahtasham Riaz (@ahtashamriaz22) January 5, 2025