
PC: BCCI/IPL.com
బీహార్‌కు చెందిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ తరపున సూర్యవంశీ డెబ్యూ చేశాడు.
ఈ యువ ఆటగాడు తొలి మ్యాచ్‌లోనే 34 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు అందరి కళ్లు ఈ యువ ఆటగాడిపైనే ఉన్నాయి. గురువారం బెంగళూరు వేదికగా ఆర్సీబీతో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది.
ఈ మ్యాచ్‌లో వైభవ్ ఎలా ఆడుతాడో అని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సూర్యవంశీపై రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్యవంశీ అతి త్వరలో టీమిండియా తరఫున అరంగేట్రం చేయబోతున్నాడని శాంసన్ జోస్యం చెప్పాడు.
"అతడు చాలా కాన్ఫిడెంట్‌గా కన్పిస్తున్నాడు. అతడిలో చాలా పవర్ ఉంది. మా క్రికెట్ ఆకాడమీలో గ్రౌండ్ బయటకు సిక్సర్లు కొట్టేవాడు. ఇంత చిన్న వయస్సులో అతడు భారీ సిక్సర్లు ఎలా కొడుతున్నాడని అందరూ మాట్లాడుకుంటున్నారు. వైభవ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్దంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు.
అతడు నాకు తమ్ముడు లాంటి వాడు. సూర్యవంశీ ఒకట్రెండు సంవత్సరాలలో భారత్ తరపున ఆడే అవకాశం ఉందని" శాంసన్ పేర్కొన్నాడు. కాగా సూర్యవంశీ అండర్-14, అండర్-16 స్థాయిలలో అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలోనే గతేడాది జరిగిన వేలంలో వైభవ్‌ను రూ. 1.1 కోట్లకు రాజస్తాన్ కొనుగోలు చేసింది.
చదవండి: IPL: కోట్లలో జీతాలు.. అత్యధిక మొత్తం అందుకున్న కామెంటేటర్ ఎవరో తెలుసా?