
దుబాయ్: శ్రీలంక పర్యటనలో రాణించిన భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ర్యాంకుల్ని మెరుగుపర్చుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్టార్ ఓపెనర్ మంధాన తొమ్మిదో స్థానానికి ఎగబాకగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 13వ ర్యాంకులో నిలిచింది. 3–0తో లంకను క్లీన్‌స్వీప్ చేసిన ఈ సిరీస్‌లో హర్మన్ 59.50 సగటుతో 119 పరుగులు చేసింది. బౌలింగ్‌లో 3 వికెట్లు తీసింది. ఓపెనర్ మంధాన 52 సగటుతో 104 పరుగులు చేసింది. వన్డే బౌలింగ్ విభాగంలో రాజేశ్వరి గైక్వాడ్ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతోంది. లంకతో వన్డేలకు దూరంగా ఉన్న వెటరన్ సీమర్ జులన్ గోస్వామి నిలకడగా ఆరో ర్యాంకులో ఉంది.