
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో గతేడాది రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ సీజన్‌లో ఆ జట్టు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచిన సన్‌రైజర్స్.. ఆతర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది (లక్నో, ఢిల్లీ, కేకేఆర్,గుజరాత్). తర్వాత పంజాబ్‌పై సంచలన విజయం సాధించి (246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి).. ముంబై ఇండియన్స్ చేతుల్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది.
తాజాగా సీఎస్‌కేను వారి సొంత ఇలాకాలో ఓడించి, సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. ఇకపై వారు ఆడాల్సిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్‌కు చేరతారన్న గ్యారెంటీ లేదు. సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌ను మే 2న (గుజరాత్‌తో) ఆడనుంది. ఆతర్వాత మే 5న ఢిల్లీతో, మే 10న కేకేఆర్‌తో, మే 13న ఆర్సీబీతో, మే 18న లక్నోతో తలపడనుంది.
Sun, sea, and a team retreat for our Risers in the Maldives! 🏖️✈️ pic.twitter.com/CyE0MvZHy3
— SunRisers Hyderabad (@SunRisers) April 26, 2025
అత్యంత కీలకమైన మ్యాచ్‌లకు ముందు వారం రోజుల విరామం లభించడంతో సన్‌రైజర్స్ యాజమాన్యం తమ ఆటగాళ్లను రీ ఫ్రెష్‌మెంట్ కోసం మల్దీవ్స్‌కు పంపింది. మాల్దీవ్స్‌లో ఆరెంజ్ ఆర్మీకి గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. తమ ఆటగాళ్లు మాల్దీవ్స్‌లో సేద తీరుతున్న దృశ్యాలను సన్‌రైజర్స్ తమ సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది.
ఈ వీడియోలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఏం పొడిచారని లీగ్ మధ్యలో సేద తీరడానికి వెళ్లారని కొందరంటుంటే.. సన్‌రైజర్స్ అభిమానులేమో కీలక మ్యాచ్‌లకు ముందు తమ ఆటగాళ్లకు ఈ మినీ వేకేషన్ అవసరమేనని సమర్దిస్తున్నారు.
కాగా, ఈ సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్‌పై భారీ అంచనాలు ఉండేవి. అందుకు తగ్గట్టుగానే తొలి మ్యాచ్‌లో ఆ జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై 286 పరుగుల రికార్డు స్కోర్ సాధించి విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీతో మెరిశాడు.
ఆ మ్యాచ్ తర్వాత మళ్లీ గెలవడానికి సన్‌రైజర్స్‌కు ఐదు మ్యాచ్‌ల సమయం పట్టింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్ రెండో విజయం సాధించింది. తాజాగా సన్‌రైజర్స్ సీఎస్‌కేపై గెలిచినా అది వారిపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా లేదు. సీఎస్‌కే నిర్దేశించిన 155 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆ జట్టు ఆపసోపాలు పడింది.