
ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో తమ దేశ స్టార్ ఫుట్‌బాలర్ జెన్నిఫర్ హెర్మోసోను బలవంతంగా ముద్దు పెట్టుకుని వివాదాల్లో చిక్కుకున్న స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశాడు. కొద్ది రోజుల కిందట ఫిఫా రుబియాలెస్‌పై వేటు వేసింది. తాజాగా రుబియాలెసే స్వయంగా తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు తన రాజీనామా లేఖను స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌కు సమర్పించాడు.
కాగా, స్పెయిన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు జగజ్జేతగా అవతరించిన అనంతరం మెడల్స్ ప్రజెంటేషన్ సందర్భంగా రుబియాలెస్.. జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో రుబియాలెస్.. జెన్నిఫర్‌తో పాటు మిగతా క్రీడాకారిణులను కూడా చెంపలపై ముద్ద పెట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు.
రుబియాలెస్ నుంచి ఊహించని ఈ ప్రవర్తన చూసి జెన్నిఫర్‌తో పాటు అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఉదంతంపై స్పెయిన్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగడంతో రుబియాలెస్ తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేశాడు. ఈ ఏడాది ఆగస్ట్‌లో జరిగిన ఫిఫా మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో స్పెయిన్.. ఇంగ్లండ్‌పై 1-0 గోల్స్ తేడాతో గెలిచి జగజ్జేతగా అవతరించింది.