మా వాళ్లకు అస్సలు బౌలింగ్‌ చేయను.. అతడొక అసాధారణ బ్యాటర్‌: కమిన్స్‌ | Unbelievable I Dont Want To bowl to Our boys Ishan incredible: Cummins | Sakshi
Sakshi News home page

మా వాళ్లకు అస్సలు బౌలింగ్‌ చేయను.. అతడొక అసాధారణ బ్యాటర్‌: కమిన్స్‌

Published Mon, Mar 24 2025 10:25 AM | Last Updated on Mon, Mar 24 2025 11:14 AM

Unbelievable I Dont Want To bowl to Our boys Ishan incredible: Cummins

ఇషాన్‌తో కమిన్స్‌ (Photo Courtesy: BCCI/SRH)

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) తాజా ఎడిషన్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) అద్భుత విజయంతో ఆరంభించింది. గత సీజన్‌ తాలుకు విధ్వంసకర బ్యాటింగ్‌ను కొనసాగిస్తూ ఉప్పల్‌ స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించింది. తమ తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ను 44 పరుగుల తేడాతో చిత్తు చేసింది.

‘పాకెట్‌ డైనమైట్‌’ సెంచరీ
స్టార్‌ ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ (31 బంతుల్లో 67) తనదైన శైలిలో చెలరేగగా.. జట్టులోకి కొత్తగా వచ్చిన ఇషాన్‌ కిషన్‌ (Ishan kishan) ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు. ఈ పాకెట్‌ డైనమైట్‌ రాజస్తాన్‌ బౌలింగ్‌ను చితకొట్టి.. అజేయ అద్భుత శతకం సాధించాడు. కేవలం 47 బంతుల్లోనే 11 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 106 పరుగులు సాధించాడు.

 

ఇక హెన్రిచ్‌ క్లాసెన్‌ క్రీజులో ఉన్నది కాసేపే అయినా ధనాధన్‌ ఇన్నింగ్స్‌ (14 బంతుల్లో 34)తో దుమ్ములేపాడు. ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో రైజర్స్‌ 286 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనలో రాజస్తాన్‌ 242 పరుగులకే పరిమితం కావడంతో జయకేతనం ఎగురువేసింది.

మా వాళ్లకు అస్సలు బౌలింగ్‌ చేయను
ఈ నేపథ్యంలో విజయానంతరం సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు బ్యాటర్లకు పొరపాటున కూడా బౌలింగ్‌ చేయబోనంటూ సహచర ఆటగాళ్ల దూకుడును ప్రశంసించాడు. ఇషాన్‌ కిషన్‌ అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడాడని కొనియాడాడు. ‘‘నమ్మశక్యం కాని బ్యాటింగ్‌ ఇది. నేను మా వాళ్లకు అస్సలు బౌలింగ్‌ చేయను.

బాబోయ్‌.. భయపెట్టేశారు
ప్రత్యర్థి జట్టు బౌలర్లను భయపెట్టేశారు. ఇలాంటి బ్యాటర్లు ఉంటే బౌలర్లకు చుక్కలే. వికెట్‌ తీయడం గురించి కాకుండా.. పరుగులను ఎలా నియంత్రించాలన్న అంశం మీదే ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. మేము గత వైభవాన్ని కొనసాగించాలని ఫిక్సయ్యాం.

 అసాధారణ ఇన్నింగ్స్‌ 
గతంలో ఆడిన ఒకరిద్దరు ప్లేయర్ల సేవలను ఈసారి మేము కోల్పోయాం. అయితే, వారి స్థానంలో వచ్చిన ఇషాన్‌ కిషన్‌ అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడాడు. స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయాలని.. ఆటను పూర్తిగా ఆస్వాదించాలని అతడు భావించాడు. మైదానంలో ఆ పని చేసి చూపించాడు.

ప్రాక్టీస్‌లో మా బాయ్స్‌ కష్టపడ్డారు. అద్భుత రీతిలో మ్యాచ్‌కు సన్నద్ధమయ్యారు. ఇక మా కోచ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. వారంతా అద్భుతం. గత మూడు- నాలుగు వారాలుగా మాతో పాటు ఉన్నారు. ఏదేమైనా మా వాళ్లు తమ భీకర బ్యాటింగ్‌తో సీజన్‌కు బ్లూప్రింట్‌లాంటిది తయారు చేశారు. మా బ్యాటర్లను ఎంత ప్రశంసించినా తక్కువే’’ అని కమిన్స్‌ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.

ఐపీఎల్‌-2025: సన్‌రైజర్స్‌ వర్సెస్‌ రాజస్తాన్‌ స్కోర్లు
👉వేదిక: రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, ఉప్పల్‌, హైదరాబాద్‌
👉టాస్‌: రాజస్తాన్‌ రాయల్స్‌.. తొలుత బౌలింగ్‌
👉సన్‌రైజర్స్‌ స్కోరు: 286/6 (20)
👉రాజస్తాన్‌ స్కోరు:  242/6 (20)
👉ఫలితం: 44 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై సన్‌రైజర్స్‌ విజయం
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: ఇషాన్‌ కిషన్‌

చదవండి: IPL 2025 RCB Vs KKR: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఒకే ఒక్కడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement