
అండర్-19 వరల్డ్‌కప్ 2024లో యువ భారత్ జట్టు ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 11న జరిగే ఫైనల్లో టీమిండియా.. పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే ఈ మెగా ఫైనల్‌కు ముందు భారత క్రికెట్ అభిమానులకు ఓ విషయం తెగ కలవరపెడుతుంది. అదేంటంటే.. వరల్డ్‌కప్ ఫైనల్ ఆస్ట్రేలియా ఫోబియా.
ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత సీనియర్ జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. అచ్చం ప్రస్తుత అండర్ 19 వరల్డ్‌కప్‌లో యువ భారత్‌లాగే 2023 వరల్డ్‌కప్‌లో భారత జట్టు కూడా ఫైనల్ వరకు అజేయంగా నిలిచింది. ఈ క్రమమే ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల కలవరానికి కారణంగా మారింది.
సీనియర్ జట్టు లాగే జూనియర్లు కూడా ఫైనల్ వరకు అజేయంగా నిలిచి, తుది సమరంలో చేతులెత్తేస్తారేమోనని భారత అభిమానులు బెంగ పెట్టుకున్నారు. భారీ అంచనాల నడుమ నాటి వరల్డ్‌కప్ ఫైనల్ బరిలోకి దిగిన టీమిండియా.. తుది సమరంలో తడబడి ఆసీస్ చేతిలో పరాభవాన్ని ఎదుర్కొంది. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడటం ఇది కొత్తేమీ కాదు.
2003 ఎడిషన్‌లోనూ టీమిండియా ఇలానే ఫైనల్లో ఆసీస్ చేతిలో చిత్తైంది. అయితే ఆ ఎడిషన్‌లో ఇప్పటిలా భారత్ అజేయ జట్టు మాత్రం కాదు. లీగ్ దశలో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. ఈ సెంటిమెంట్లను పక్కన పెడితే పరిస్థితులు ఎప్పటికీ ఒకేలా ఉండవన్న గ్రహించాలి. గత వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఆసీస్ చేతిలో ఓడిన భారత జట్ల పరిస్థితి.. ప్రస్తుత యువ భారత జట్టు పరిస్థితి వేర్వేరుగా ఉన్నాయి.
ప్రస్తుత యువ భారత్ జట్టు అంత ఈజీగా ఓటమి ఒప్పుకునే పరిస్థితి లేదు. సౌతాఫ్రికాతో జరిగిన సెమీఫైనలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 249 పరుగుల లక్ష్య ఛేదనలో 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్‌ను కెప్టెన్ ఉదయ్ సహారన్ (81), సచిన్ దాస్ (96) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి గెలిపించారు.
ప్రస్తుత యువ భారత జట్టు ఎంతటి ఒత్తిడినైనా అధిగమించి, సత్ఫలితాలు రాబట్లగల సమర్ధమైన జట్టు. ఫైనల్లో యంగ్ ఇండియా ఆసీస్‌ను మట్టికరిపించి, సీనియర్లకు ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని అశిద్దాం. ఈ వరల్డ్‌కప్ గెలిస్తే యువ భారత్ ఐదో సారి జగజ్జేతగా నిలుస్తుంది. ఫైనల్ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవుతుంది.