
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్లు గ్లెన్ మాక్స్‌వెల్, లియామ్ లివింగ్‌స్టోన్ దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన ఏ మ్యాచ్‌లోనూ ఈ స్టార్ క్రికెటర్లు తమ మార్క్‌ను చూపించలేకపోయారు.
దీంతో వారిద్దరిపై ఇరు జట్ల మెన్‌జెమెంట్‌లు వేటు వేశాయి. ఇప్పటికే మాక్స్‌వెల్‌ను పంజాబ్ కింగ్స్ గత రెండు మ్యాచ్‌లకు దూరం పెట్టగా.. ఆర్సీబీ కూడా లివింగ్ స్టోన్‌ను తమ ఆఖరి మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం చేసింది. ఆదివారం ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో లివింగ్ స్టోన్‌కు ఆర్సీబీ తుది జట్టులో చోటు దక్కలేదు.
అతడి స్దానంలో కరేబియన్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ క్రమంలో మాక్స్‌వెల్, లివింగ్ స్టోన్‌పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు. వారి ఆట తీరును చూస్తుంటే ఏదో హాలిడేకి వచ్చినట్లు ఉందని సెహ్వాగ్ మండిపడ్డాడు.
"మాక్స్‌వెల్, లివింగ్ స్టోన్‌లో తమ జట్ల కోసం పోరాడాలనే కసి కనిపించడం లేదు. వారు ఏదో హాలిడే కోసం భారత్‌కు వచ్చినట్లు అన్పిస్తోంది. ఇక్కడకు వచ్చి బాగా ఎంజాయ్ చేసి వెళ్లిపోవడమే వాళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతే తాము ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు కోసం ఏదైనా చేయాలనే తపన వారిలో లేదు.
గతంలో చాలా మంది విదేశీ క్రికెటర్లతో కలిసి ఆడాను. వారిలో ఒకరిద్దరూ మాత్రమే జట్టు కోసం ఏదైనా చేయడానికి సిద్దంగా ఉన్నట్లు అప్పటిలో నాకు అన్పించిందని" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. కాగా మాక్స్‌వెల్ ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడి కేవలం 41 పరుగులతో పాటు నాలుగు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు లివింగ్‌స్టోన్ 7 మ్యాచ్‌లు ఆడి 87 పరుగులు చేశాడు.
చదవండి: PBKS vs RCB: నాకెందుకు?.. ఇందుకు అతడే అర్హుడు: విరాట్ కోహ్లి