
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా జూన్ 7-11 మధ్యలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం ఇరు జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. జట్ల బలాబలాలు, విజయావకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయన్న విషయాలు పక్కన పెడితే.. ఓవల్ మైదానంలో ఇరు జట్ల ట్రాక్ రికార్డు ఏమంత బాగోలేదు. ఈ వేదికపై ఆసీస్ ఆడిన 38 మ్యాచ్‌ల్లో ఏడింటిలో విజయం సాధించగా.. భారత జట్టు ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలోనే మాత్రమే గెలుపొందింది.
కోహ్లి, పుజారా, రహానేల చెత్త రికార్డు.. ఓవల్‌లో హిట్‌మ్యానే కింగ్
ఓవల్‌లో భారత ఆటగాళ్లు కోహ్లి, రహానే, పుజారాలకు చెత్త రికార్డు ఉంది. ఇక్కడ విరాట్ కోహ్లి ఆడిన 3 మ్యాచ్‌ల్లో 28.16 సగటున కేవలం 169 పరుగులు మాత్రమే చేశాడు. పుజారా ఓవల్‌లో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 19.50 సగటున 117 పరుగులు చేశాడు. రహానే ఇక్కడ ఆడిన 3 మ్యాచ్‌ల్లో 9.16 సగటున 55 పరుగులు మాత్రమే చేశాడు.
టీమిండియాకు అత్యంత కీలకమైన ముగ్గురు ఆటగాళ్లకు ఓవల్‌లో మెరుగైన రికార్డు లేకపోవడం ఫ్యాన్స్‌ను కలవరపెడుతుంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు ఇక్కడ మెరుగైన రికార్డు ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం.
రోహిత్ శర్మ ఓవల్ మైదానంలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడి 127 పరుగులు చేశాడు. 2021 పర్యటనలో హిట్‌మ్యాన్ సెంచరీ చేశాడు. జడేజా ఇక్కడ 2 మ్యాచ్‌ల్లో 42 సగటున 126 పరుగులు చేసి 11 వికెట్లు పడగొట్టాడు.
ఆస్ట్రేలియా జట్టును కూడా పరిగణలోకి తీసుకుంటే, ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్న ఇరు జట్ల సభ్యుల్లో ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు ఓవల్‌లో మెరుగైన రికార్డు ఉంది. స్టీవ్ స్మిత్ ఇక్కడ రెండు శతకాలు బాదాడు.