
చైత్ర అమావాస్యకు పోటెత్తిన భక్తులు
● పితృదేవతలకు పిండ ప్రదానం
తిరువళ్లూరు: చైత్రమాసం అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. తిరువళ్లూరు పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వైద్య వీరరాఘవ స్వామివారి ఆలయం ఉంది. ఆలయానికి తిరువళ్లూరు నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలు, జిల్లాల నుంచి ప్రతి అమావాస్యకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఆదివారం చైత్రమాసం అమావాస్య కావడంతో శనివారం రాత్రే పెద్ద ఎత్తున చేరుకుని ఆలయం వద్ద జాగారం చేశారు. అనంతరం ఉదయం పుణ్యస్నానాలను ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానం చేసి తమ మొక్కుబడిని చెల్లించుకున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు క్యూలైన్‌లో వేచి ఉండి స్వామి వారిని దర్శించుకున్నారు. పిండ ప్రదానం, స్వామివారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడిపోయింది. దీంతోపాటు కొంత మంది భక్తులు పుష్కరిణిలో బెల్లం, ఉప్పు తదితర వాటిని సైతం చల్లి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయంలో దర్శనం కోసం వచ్చిన భక్తులు చేసిన గోవిందనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

చైత్ర అమావాస్యకు పోటెత్తిన భక్తులు