ఆదాయం పెరిగితేనే పథకాలు నడపగలం | Appointment letters issued to 1692 teachers | Sakshi
Sakshi News home page

ఆదాయం పెరిగితేనే పథకాలు నడపగలం

Published Thu, Mar 13 2025 4:48 AM | Last Updated on Thu, Mar 13 2025 5:58 AM

Appointment letters issued to 1692 teachers

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

రాష్ట్రానికి నెలకు రూ.22 వేల కోట్ల ఆదాయం కావాలి  

కానీ రూ.18,500 కోట్ల వరకు మాత్రమే వస్తోంది 

ఇందులో రూ.6,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే పోతున్నాయ్‌ 

మరో రూ.6,500 కోట్లు అప్పుల రీపేమెంట్‌కు కడుతున్నాం 

మిగిలిన రూ.5,500 కోట్లతోనే సంక్షేమ పథకాలు అమలు చేయాలి 

ఇబ్బంది ఉంది కాబట్టే ఒక్కో నెల ఒక్కో పథకానికి కోత తప్పడం లేదన్న సీఎం 

స్టేచర్‌ ఉందనుకునే నాయకులు స్ట్రెచర్‌ మీదకు వెళ్లారని వ్యాఖ్య  

1,692 మంది అధ్యాపకులకు నియామక పత్రాల అందజేత 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి ప్రతినెలా రూ.22 వేల కోట్ల ఆదాయం అవసరమని, అంత ఉంటేనే సంక్షేమ పథకాలను ఓ మోస్తరుగా నడపగలమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇప్పుడొస్తున్న ఆదాయంలో ఉద్యోగుల వేతనాలు, అప్పులకే రూ.13 వేల కోట్లు పోతున్నాయన్నారు. ఆర్థిక పరిస్థితి క్యాన్సర్‌లా మారిందని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఏం చేయాలో ఉద్యోగులు చెప్పాలని కోరారు. 

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఎంపికైన 1,292 మంది జూనియర్‌ కాలేజీ లెక్చరర్లు, 400 మంది పాలిటెక్నిక్‌ కాలేజీ అధ్యాపకులకు బుధవారం రవీంద్రభారతి వేదికగా ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.  

ప్రభుత్వం రొటేషన్‌ మాత్రమే చేస్తోంది.. 
‘ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.18 వేల కోట్ల నుంచి రూ.18,500 కోట్ల ఆదాయం వస్తోంది. ఇందులో రూ.6,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు చెల్లించాల్సి వస్తోంది. రూ.6,500 కోట్లు అప్పులు తిరిగి చెల్లించేందుకు కడుతున్నాం. మిగిలిన రూ.5 వేల కోట్ల నుంచి రూ.5.5 వేల కోట్లల్లోనే 25 నుంచి 30 సంక్షేమ పథకాలకు చెల్లించాలి. ఏ ప్రాజెక్టులు కట్టాలన్నా, ఏ అభివృద్ధి చేయాలన్నా ఈ నిధులే వాడుకోవాలి. ఈ ఇబ్బంది ఉంది కాబట్టే ఒక్కో నెలలో ఒక్కో పథకానికి చెల్లింపు పెండింగ్‌లో పెడుతున్నాం. మా ప్రభుత్వం రొటేషన్‌ చేసే పని మాత్రమే చేస్తోంది.  

గత సీఎం క్యాన్సర్‌ ఇచ్చిపోయాడు 
గత ముఖ్యమంత్రి రాష్ట్రానికి క్యాన్సర్‌ ఇచ్చి పోయాడు. దీన్ని నయం చేసే ప్రయత్నం చేస్తుంటే పది నెలలకే దిగిపొమ్మంటున్నారు. తల తాకట్టు పెట్టి ఉద్యోగులకు ప్రతి నెలా మొదటి రోజు వేతనాలు ఇస్తున్నాం. ఉద్యోగులు విపక్షాల మాటలకు ప్రభావితం కావొద్దు. స్టేచర్‌ ఉందనుకునే నాయకులు స్ట్రెచ్చర్‌ మీదకు వెళ్ళారు. అక్కడి నుంచి మార్చురీకి కూడా నేను ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్లను. నా కాళ్లు, చేతులు బాగానే ఉన్నాయి. పనిచేసి జీవిస్తా..’అని సీఎం అన్నారు.  

అధ్యాపకులు భవిష్యత్తుకు బాటలు వేయాలి 
‘ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందుకున్న వారిలో భావోద్వేగం కన్పిస్తోంది. పరీక్షలు రాసి 12 ఏళ్ళు నిరీక్షించారు. గత ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేమి కాలయాపనకు కారణం. న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడంపై నేను ప్రత్యేక శ్రద్ధ చూపా. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 57,946 ప్రభుత్వ నియామకాలు చేపట్టాం. దేశ చరిత్రలోనే ఇది ఎక్కడా లేదు. గత పాలకుల ఉద్యోగాలు తీసి వేయడం వల్లే ఇన్ని ఉద్యోగాలొచ్చాయి. తెలంగాణ భవిష్యత్‌కు అధ్యాపకులు బాటలు వేయాలి. అంకిత భావంతో పనిచేయాలి. 

ఒక్కో విద్యార్థికి ఏటా రూ.80 వేలు ఖర్చు చేస్తున్నాం.. 
రాష్ట్ర విద్యారంగంలో ప్రమాణాలు పడిపోతున్నాయి. ప్రభు త్వ స్కూళ్ళల్లో ప్రవేశాలు ప్రతి ఏటా తగ్గుతున్నాయి. ఒక్కో విద్యార్థికి ఏటా రూ.80 వేలకు పైగా ఖర్చు చేస్తున్నాం. విద్యార్థులు ఎక్కువగా ప్రైవేటు స్కూళ్ళల్లో ఎందుకు చేరుతున్నారో క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. నిజానికి ప్రైవేటు కన్నా ప్రభుత్వ స్కూళ్ళలోనే నాణ్యమైన టీచర్లు ఉన్నారు. అయినా ప్రజలు ఎందుకు నమ్మడం లేదు? సర్కారీ స్కూళ్ళల్లో పోటీ తత్వం పెరగాలి. ఇందుకు తగ్గ ప్రణాళికలు రూపొందిస్తాం..’అని రేవంత్‌ చెప్పారు. 

ఇంజనీరింగ్‌లో నాణ్యత ఉండటం లేదు..
‘రాష్ట్రంలో ఏటా 1.10 లక్షల మంది ఇంజనీరింగ్‌ పూర్తి చేస్తున్నారు. ఇందులో 10 శాతం మందికి కూడా ఉద్యోగాలు రావడం లేదు. ప్రతి ఒక్కరూ కంప్యూటర్‌ కోర్సు కోసం ఆరాటపడుతున్నా, వారికి బేసిక్స్‌ కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో విద్యతో పాటు నైపుణ్యం పెంచడమే లక్ష్యంగా స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. క్రీడా రంగంలో వెనుకబాటును అధిగమించడమే లక్ష్యంగా క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు చేశాం..’అని సీఎం వివరించారు. 

కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, సీఎస్‌ శాంతికుమారి, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, సాంకేతిక విద్య కమిషనర్‌ దేవసేన, పాఠశాల విద్య డైరెక్టర్‌ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement