
హైదరాబాద్,సాక్షి: మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. భారత పౌరసత్వం లేకపోయినా తప్పుడు పత్రాలు సమర్పించిన ఎన్నికల్లో పోటీ చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చెన్నమనేని రమేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫిర్యాదుతో చెన్నమనేనిపై తెలంగాణ సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను అందించాలని పిలుపునిచ్చింది. బుధవారం కేసు వివరాల్ని అందించేందుకు ఆది శ్రీనివాస్ సీఐడీ ఎదుట హాజరుకానున్నారు.
చెన్నమనేని రమేష్ జర్మన్ పౌరుడే
చెన్నమనేని పౌరసత్వంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు. తాజాగా,ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో చెన్నమనేని పౌరసత్వంపై పలు దఫాలుగా విచారణ చేపట్టింది. విచారణలో గతేడాది డిసెంబర్ నెలలో చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది. భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ 2019లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను సమర్థించింది. తప్పుడు పత్రాలతో గత 15 ఏళ్లుగా న్యాయస్థానాన్ని, అధికారులను తప్పుదోవ పట్టించారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ పౌరుడినని తెలిసినా పలు పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేశారని మండిపడింది.
ఇందుకుగాను ఆయనకు హైకోర్టు చరిత్రలోనే తొలి సారిగా ఏకంగా రూ. 30 లక్షల భారీ జరిమానా విధించింది. ఇందులో ఆది శ్రీనివాస్ (ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో రమేశ్ ప్రత్యర్థి)కు రూ. 25 లక్షలు, హైకోర్టు లీగల్ సర్విసెస్ కమిటీకి రూ. 5 లక్షలు చెల్లించాలని రమేష్‌ను ఆదేశించింది. చెల్లింపునకు నెల రోజులు గడువు విధించింది. 2009లో తొలిసారి వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించింది మొదలు చెన్నమనేని భారతీయ పౌరుడా కాదా అనే వివాదం కొనసాగుతోంది.
ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ దీనిపై తొలి నుంచీ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జర్మనీ పౌరసత్వం కారణంగా రమేష్ భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ 2019 నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ అదే సంవత్సరం ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ఐదేళ్లపాటు సాగిన విచారణ అనంతరం న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి గతేడాది అక్టోబర్‌లో తీర్పు రిజర్వు చేసి డిసెంబర్ నెలలో తుది తీర్పును వెలువరించారు.