
వీఆర్వోగా, జూనియర్ అసిస్టెంట్‌గా రాణించిన దివ్య
గ్రూప్ –2లో ప్రతిభ
తెలంగాణ పబ్లిక్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్–1, 2 ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సత్తాచాటారు. కొందరు అభ్యర్థులు ఇదివరకు గ్రూప్–4 (Group-4)ఫలితాల్లో ర్యాంకులు సాధించి ఆయా శాఖల్లో ఉద్యోగం చేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు ఉత్తమ ర్యాంకులు సాధించడం విశేషం.
ధర్మారం(ధర్మపురి): ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ – 2(Group-2) ఫలితాల్లో మండల కేంద్రానికి చెందిన మోటపల్లి దివ్య రాష్ట్రస్థాయిలో 169వ ర్యాంక్ సాధించారు. కాళేశ్వరం జోన్ మహిళా విభాగంలో రెండో ర్యాంక్ సాధించారు. బంగారు ఆభరణాల పనిచేసే మోటపల్లి తిరుపతి–భారతి దంపతుల కూతురు దివ్య(Divya ). బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ చదివారు. 2019లో వీఆర్వోతోపాటు గ్రూప్ – 4 ఉద్యోగం కోసం నిర్వహించిన పరీక్ష రాశారు.
తొలుత వీఆర్వో ఉద్యోగానికి ఎంపికయ్యారు. జూలపల్లి మండలంలో పనిచేశారు. గ్రూప్– 4 పరీక్ష ఫలితాలు 2021లో ప్రకటించగా రాష్ట్రస్థాయిలో 47వ ర్యాంక్ సాధించారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగానికి ఎంపికయ్యారు. 317 జీవో కింద దివ్యను ధర్మారం తహసీల్దార్ కార్యాలయానికి జూనియర్ అసిస్టెంట్‌గా బదిలీ చేశారు. గ్రూప్ – 1 లక్ష్యంగా ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టిన ఆమె.. రెండు నెలల వ్యవధిలోనే గ్రూప్ –2, గ్రూప్ –1 పరీక్షలు నిర్వహించగా రెండింటికి ప్రిపేరయ్యారు. మంగళవారం విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో సత్తా చాటారు.