
ఇంజనీరింగ్ కాలేజీల ప్రతిపాదనలపై సర్కార్ బెంబేలు
కన్వీనర్ కోటా ఫీజులు భారీగా పెంచాలని కోరుతున్న యాజమాన్యాలు
ఒత్తిడికి తలొగ్గితే ఇబ్బందులు తప్పవని భావిస్తున్న ప్రభుత్వం
వాస్తవ పరిస్థితులపై అధ్యయనానికి కమిటీ వేసే యోచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ ఏడాది ఫీజులు భారీగా పెంచాలంటూ కాలేజీలు ఒత్తిడి చేస్తున్నాయి. అయితే ఇందుకు ఆమోదం తెలిపితే సర్కారు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని సీఎం సలహాదారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు నివేదించడంతో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రభుత్వ పెద్దలు తర్జనభర్జనలు పడుతున్నట్లు సమాచారం.
ప్రైవేటు కాలేజీలు ప్రతిపాదించిన కన్వీనర్ కోటా ఫీజుల వివరాలను ఇటీవల రాష్ట్ర ఫీజులు, నియంత్రణ మండలి (ఎఫ్‌ఆర్‌సీ) ప్రభుత్వానికి పంపింది. రెండురోజుల క్రితం ఉన్నతాధికారులు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. సర్కార్ ఆమోదం తెలిపితే ఎఫ్‌ఆర్‌సీ ఫీజులను ఖరారు చేసే వీలుందని తెలిపారు.
అయితే కాలేజీలు ప్రతిపాదించిన ఫీజులపై ప్రభుత్వం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైనట్టు తెలిసింది. ఫీజులు భారీగా ఉండటం గమనించిన ప్రభుత్వం..కాలేజీలు కోరుతున్నట్టుగా ఫీజులు పెంచితే ప్రభుత్వం పెద్దయెత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఫీజుల విషయంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచి్చనట్లు తెలిపాయి.
ఎక్కువ వ్యయంతో ఆడిట్ రిపోర్టులు
ఇంజనీరింగ్ ఫీజులను ఎఫ్‌ఆర్‌సీ ప్రతి మూడేళ్ళకోసారి సమీక్షిస్తుంది. చివరిసారిగా 2022లో కొత్త ఫీజులను ఖరారు చేశారు. ఇవి 2022–23, 2023–24, 2024–25 విద్యా సంవత్సరానికి వర్తించాయి. 2025–26, 2026–27, 2027–28 విద్యా సంవత్సరం కోసం కొత్త ఫీజులను ఖరారు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 157 ఇంజనీరింగ్ కాలేజీలు కొత్త ఫీజులపై ప్రతిపాదనలు పంపాయి.
గత మూడేళ్ళుగా కాలేజీల్లో ప్రవేశపెట్టిన కొత్త కోర్సులు, మౌలిక వసతుల కల్పన, ఇతర ఖర్చులతో కూడిన ఆడిట్ రిపోర్టులు సమరి్పంచాయి. వీటిని ఎఫ్‌ఆర్‌సీ సూచించిన ఆడిట్ బృందాలు కొన్ని నెలలుగా సమగ్రంగా అధ్యయనం చేశాయి. ఆ తర్వాత కాలేజీలతో విడివిడిగా ఎఫ్‌ఆర్‌సీ అధికారులు మాట్లాడారు. ఇందులో వెల్లడైన అంశాల ఆధారంగా ఫీజుల పెంపుపై ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు.
2022 వరకూ అంతకు ముందు ఫీజులపై గరిష్టంగా పది శాతం పెంచుకునే అవకాశం కల్పించే వాళ్ళు. కానీ ఇప్పుడు కాలేజీల ప్రతిపాదనలు ఊహించని స్థాయిలో ఉన్నాయి. కరోనా తర్వాత పెద్దగా ఫీజులు పెంచలేదని, 2022 తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ సహా పలు కోర్సులు తీసుకొచ్చామని, దీనికి ఫ్యాకల్టీతో పాటు, మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున ఖర్చు చేశామని, ఈ మేరకు ఫీజులు పెంచాలని కాలేజీలు అంటున్నాయి.
ఫీజులు పెంచాల్సిందే..
దాదాపు అన్ని కాలేజీలు పెద్ద ఎత్తున ఫీజుల పెంపు ప్రతిపాదనలు చేశాయి. 52 శాతం నుంచి 84 శాతం ఫీజుల పెంపును కోరుతున్నాయి. కనీ్వనర్ కోటా ఫీజు పెరిగితే బీ కేటగిరీ ఫీజులు మరింత పెంచుకోవచ్చని కాలేజీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో రూ.1.50 లక్షల వార్షిక ఫీజు ఉన్న 73 కాలేజీలు ఏకంగా రూ. 2.25 లక్షల వరకూ ఫీజు పెంపును ప్రతిపాదించాయి. 33 కాలేజీల్లో ప్రస్తుతం రూ.లక్ష లోపు ఫీజు ఉంది. దీన్ని రెట్టింపు చేయాలని ఎఫ్‌ఆర్‌సీ ముందు ప్రతిపాదించాయి. టాప్ టెన్ కాలేజీలు తమ ఫీజులను రూ.2.50 లక్షలకు పెంచాలని కోరుతున్నాయి.
సీఎస్ నేతృత్వంలో కమిటీ!
కాలేజీల ఒత్తిడి నేపథ్యంలో ఫీజులపై వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేయడానికి కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యతను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అప్పగించిననట్టు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అన్ని విశ్వవిద్యాలయాల వీసీల నుంచి ప్రైవేటు కాలేజీల్లో కోర్సులు, మౌలిక వసతులు, ఫీజులపై వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ అయినట్టు తెలిసింది. ఈ నివేదికలు వచి్చన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే వీలుందని చెబుతున్నారు.