
దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్‌లో బిజినెస్
హైదరాబాదీల మెనూలో హలీమ్‌దే అగ్రస్థానం
రికార్డు స్థాయిలో50 లక్షలకుపైగా ప్లేట్ల విక్రయాలు
గతేడాది రంజాన్ మాసం కంటే ఈసారి 20 శాతం పెరిగిన అమ్మకాలు
సాక్షి, సిటీబ్యూరో: రంజాన్ వచ్చిoదంటే హైదరాబాదీలకు ముందుగా గుర్తుకు వచ్చేది హలీమే. ఈ మాసంలో ప్రత్యేకంగా లభించే హలీమ్ కోసం మాంసప్రియులు తహతహలాడతారు. ఈసారి రికార్డు స్థాయిలో జరిగిన హలీమ్ అమ్మకాలే దానికి నిదర్శనం. ఏకంగా రూ.వేయి కోట్ల మేర హలీమ్ వ్యాపారం జరిగిందని అంచనా. దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్‌లో హలీమ్ విక్రయాలు సాగాయని వ్యాపారులు చెబుతున్నారు. పోషకాలతో కూడిన రుచికరమైన హలీమ్ కేంద్రాలు, హోటళ్లు రంజాన్ నెలంతా కిటకిటలాడాయి.
ప్రతి హోటల్ ముందు ప్రత్యేక బట్టీలు, కౌంటర్ల ద్వారా విక్రయాలు సాగాయి. ఈ సీజన్‌లో దాదాపు 50 లక్షల ప్లేట్ల హలీమ్ అమ్మకాలు జరిగినట్లు హైదరాబాద్ హోటళ్ల సంఘం చెబుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 20 శాతం అధికంగా హలీమ్ అమ్మకాలు సాగాయని అంటోంది. కేవలం హోటళ్లలోనే కాదు ఫుడ్ డెలివరీ యాప్‌లలోనూ హలీమ్‌కే ఆహారప్రియులు ఓటేశారు. టేక్ ఆవేలు, స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్‌లతో హలీం అమ్మకాలు ఒక రేంజ్‌లో సాగాయి.
ఆరువేల విక్రయ కేంద్రాలు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 6 వేల చిన్నా, చితక హలీమ్ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధాన రెస్టారెంట్లు వీటికి అదనం. చిన్న, మధ్య తరగతి రెస్టారెంట్లే కాదు స్టార్ హోటళ్లలోనూ రంజాన్ సీజన్ మెనూలో హలీం డిష్‌ను తప్పనిసరి చేశారు. హైదరాబాదీ బిర్యానీని హలీం ఓవర్ టేక్ చేసి మెనూలో టాప్‌లో నిలిచింది. చిన్న హలీం కేంద్రాల్లో రోజుకు దాదాపు వంద పేట్ల చొప్పున అమ్మకాలు జరిగితే, పేరున్న హోటళ్లు, కేంద్రాల్లో సుమారు 500–600 ప్లేట్ల హలీం విక్రయించారని అంచనా.
వీకెండ్‌లలో 25 శాతం అధికం..
హలీమ్ ప్లేట్ ధర రూ.100 నుంచి 320 వరకు పలికింది. ఎక్కువ శాతం మటన్ హలీమ్ సెంటర్లు ఉండగా, పలు ప్రాంతాల్లో చికెన్, బీఫ్ కేంద్రాలు కూడా వెలిశాయి. వీటిలో అత్యధికంగా 70 శాతం మేర పాతబస్తీలోనే ఉన్నాయి. సగటున రోజుకు దాదాపు రూ.30 కోట్ల నుంచి రూ.35 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా. సాధారణ రోజుల కంటే వీకెండ్‌లలో 25 శాతం అధికంగా విక్రయాలు జరిగాయని జహంగీర్ అనే హలీం కేంద్ర నిర్వాహకుడు తెలిపారు. పాతబస్తీతో పోలిస్తే సైబరాబాద్‌లో హలీం జోష్ ఎక్కువగా ఉందని, పేరొందిన ఫుడ్ బ్లాగర్స్ కూడా హలీంను ప్రమోట్ చేసేలా వార్తలు ఇవ్వడం అమ్మకాలకు కలిసొచ్చిందని షెరటన్ హోటల్ మేనేజర్ నాసర్ చెప్పారు.