కాకతీయుల కాలంలోని అద్భుతమైన నిర్మాణం | julurpadu raja bavi history and other details | Sakshi
Sakshi News home page

Raja Bavi: కాకతీయుల కాలంలోని అద్భుతమైన నిర్మాణం

Published Mon, Feb 17 2025 7:32 PM | Last Updated on Mon, Feb 17 2025 7:32 PM

julurpadu raja bavi history and other details

బావి చుట్టూ గదులు కూడా..

సొరంగమార్గం ద్వారా రాకపోకలు కొనసాగేవని ప్రచారం

చారిత్రక సంపద పరిరక్షణపై అధికారుల నిర్లక్ష్యం  

జూలూరుపాడు: సుమారు ఏడు శతాబ్దాల క్రితం కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక కట్టడం కనుమరుగవుతోంది. కాకతీయుల కాలంలో తాగునీటి అవసరాలు, శత్రు సైన్యాల నుంచి తమను రక్షించుకోవడానికి దట్టమైన అడవి ఉన్న జూలూరుపాడు (Julurpadu) ప్రాంతంలో రాజాబావిని రాతికట్టడంతో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. సువిశాలమైన రాజాబావికి రెండు వైపులా నివాసం కోసం గదులు నిర్మించి ఉంటారని తెలుస్తోంది. ఈ బావి పైభాగాన తూర్పు, పడమరకు ఎదురెదురుగా 10 గదులు నిర్మించారు. బావిలోకి దిగేందుకు 30 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో రాళ్లతో మెట్లు నిర్మించారు. 

ఈ బావి చుట్టూ 8 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు గల పైకప్పు ఒకేరాయిలా కనిపిస్తోంది. పూడిక మట్టితో నిండిపోవడంతో బావి లోతు ఎంత అనేది తెలియడం లేదు. సున్నం, రాళ్లతో నిర్మించిన ఈ ప్రాచీన కట్టడం నేటికీ చెక్కుచెదరలేదు. అయితే, గుప్తనిధుల కోసం తవ్వకాలు, చెత్తాచెదారం పేరుకుపోవడం, బావిలో పూడిక పెరగడంతో నానాటికీ వైభవం కోల్పోతున్నా సంరక్షణపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.  

దండయాత్రల నుంచి రక్షణకు..  
శత్రువులు దండయాత్ర చేసినప్పుడు రక్షణ కోసం కాకతీయ రాజులు (Kakatiya Kings) పలు ప్రాంతాల్లో సొరంగ మార్గాలు ఏర్పాటు చేసుకునేవారని చరిత్ర చెబుతోంది. ఇందులో భాగంగానే వివిధ ప్రాంతాల మీదుగా సొరంగ మార్గాల ద్వారా ఖమ్మం ఖిలాకు వచ్చేవారని, కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు (వరంగల్‌)కోటకు, పాత ఖమ్మం (Khammam) జిల్లాలోని జూలూరుపాడు రాజుల బావి, భేతాళపాడు గుట్టలపై ఉన్న కోట వరకు వచ్చేవారని తెలుస్తోంది. 

జూలూరుపాడు నుంచి పాపకొల్లులోని పుట్టకోట, చండ్రుగొండ మండలం బెండాలపాడు గుట్టల్లో వెలిసిన శ్రీవీరభద్రస్వామి, కనగిరి గుట్టల్లోని ఆలయాలు, అప్పట్లో సైనికులు తలదాచుకునేందుకు ఏర్పాటు చేసిన కొన్ని స్థావరాలు నేటికీ కనిపిస్తాయి. అక్కడ ఉన్న సొరంగ మార్గాల ద్వారా శత్రువుల నుంచి రక్షణ పొందటంతోపాటు, శత్రువులపై మెరుపు దాడులు నిర్వహించేందుకు ఈ మార్గాలను ఉపయోగించుకునేవారు.

గుప్తనిధుల కోసం తవ్వకాలు.. 
కాకతీయ రాజులు వజ్ర వైఢూర్యాలు, బంగారు అభరణాలను ఈ బావిలో భద్రపరిచే వారని నమ్ముతుంటారు. బావిలో గుప్త నిధులు ఉన్నాయనే ప్రచారంతో ఏడేళ్ల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు బావి పైభాగాన ఉన్న గదుల్లో తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించినా అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో చారిత్రక కట్టడం ధ్వంసానికి గురవడంతో బావి ఆనవాళ్లు భావితరాలకు కన్పించకుండా పోయే పరిస్థితి ఏర్పడనుంది.  

తగ్గని నీటిమట్టం.. 
బావి నీటిని గతంలో ఈ ప్రాంత వాసులు తాగునీటిగా ఉపయోగించేవారు. బావిలో నీటిమట్టం తరగకపోవడంతో, బావిలో ఏమైనా గుప్త నిధులు ఉన్నాయా అని తెలుసుకునేందుకు కొన్నేళ్ల క్రితం గ్రామస్తులు ఆయిల్‌ ఇంజిన్లు పెట్టి నీటిని 15 రోజుల పాటు పంటలకు వినియోగించినా నీటిమట్టం ఎంతమాత్రం తగ్గలేదు. దీంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. బావిలోకి దిగుడు మెట్లు, బావి చుట్టూ తిరగటానికి వీలుగా ప్లాట్‌ఫామ్‌ ఉన్నాయి. 

ఈ తరం ఇంజనీర్లకు సైతం అంతు చిక్కని అద్భుత సాంకేతిక నైపుణ్యంతో రాతిబావిని నిర్మించడం విశేషం. అలాంటి బావి పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతూ పూడిక మట్టి, ముళ్ల పొదలతో నిండిపోయింది. బావి చుట్టూ ఉన్న స్థలం కూడా ఆక్రమణకు గురికావడంతో ముళ్ల పొదలు, చెట్లతో కళావిహీనంగా మారింది. చారిత్రక సంపద ధ్వంసం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.  

రాజాబావి నీళ్లు తాగే వాళ్లం 
40 ఏళ్ల క్రితం రాజాబావి నీళ్లు తాగే వాళ్లం. వేసవి కాలంలో కూడా నీళ్లు బాగా ఉండేవి. ఈ నీటిని పంటల సాగుకూ ఉపయోగించేవారు. ప్రస్తుతం పూడికతో నిండిపోవడంతో పాటు ముళ్ల పొదలు, చెట్లు పెరగడంతో అటువైపు ఎవరూ వెళ్లడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మతులు చేయాలి.                
– చిన్నకేశి వెంకటేశ్వర్లు, జూలూరుపాడు 

చారిత్రక కట్టడాన్ని కాపాడాలి 
వందల ఏళ్ల నాటి చారిత్రక కట్టడం కనుమరుగు కాకుండా చూడాలి. రాజాబావి ధ్వంసమవుతుండటంతో భావితరాలకు కన్పించకుండాపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి చారిత్రక సంపదను రక్షించేందుకు ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపట్టాలి.  
– తాళ్లూరి వెంకటేశ్వర్లు, జూలూరుపాడు 

బావి అభివృద్ధికి చర్యలు చేపట్టాలి 
రాజాబావి అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలి. కొన్ని దశాబ్దాలుగా అధికారులు పట్టించుకోకపోవడంతో ముళ్ల పొదలు, చెట్లతో నిండి కళావిహీనంగా మారింది. దీన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.  
– నర్వనేని పుల్లారావు, జూలూరుపాడు 

చ‌ద‌వండి: వరంగల్‌ పేరు ఎలా వచ్చిందంటే..

పురాతన సంపదను కాపాడతాం 
కాకతీయుల కాలం నాటి పురాతన కట్టడమైన రాజా బావిని కాపాడుతాం. ఈ సమస్యను ఉన్నతాధికారులు, పర్యాటక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. స్థానిక గ్రామ పంచాయతీ నుంచి ఏమైనా చేయవచ్చేమో పరిశీలిస్తాం. ముళ్ల పొదలు, చెట్లు తొలిగించి, పూర్వవైభవం వచ్చేలా చర్యలు చేపడతాం.  
– డి.కరుణాకర్‌రెడ్డి, ఎంపీడీఓ జూలూరుపాడు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement