
భద్రాద్రి కొత్తగూడెం, సాక్షి: మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు చేపట్టిన ఆపరేషన్ చేయుత కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తోంది. శనివారం కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో 86 మంది దళ సభ్యులు లొంగిపోయారు. వీళ్లంతా బీజాపూర్, సుక్మా జిల్లా దళ సభ్యులుగా తెలుస్తోంది.
అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి.. ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయ సహకారాన్ని అందిస్తాం.. అంటూ ఆపరేషన్ చేయూతను చేపట్టింది పోలీస్ శాఖ. ఈ కార్యక్రమం కింద.. లొంగిపోయిన ప్రతి సభ్యుడికి ఇవాళ రూ. 25 వేల చెక్కును ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అప్పగించారు.లొంగిపోయిన వాళ్లలో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారు.
ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి మావోయిస్టులు అడ్డంకిగా మారారు. పైగా మావోయిస్టు పార్టీ పేరుతో కొందరు బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. తక్షణమే ఆ పనిని ఆపాలి. గత నాలుగు నెలల్లో భారీ ఎత్తున మావోయిస్టు సభ్యుల లొంగిపోయారు. గత నాలుగు నెలల్లో జిల్లా వ్యాప్తంగా 203 మంది లొంగిపోగా.. మరో 66 మందిని అరెస్ట్ చేశాం అని అన్నారాయన. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ములుగ జిల్లా ఎస్పీ శబరీష్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
కిందటి నెలలోనూ ఆపరేషన్ చేయూతకు విశేష స్పందన లభించింది. ఒకేరోజు 64 మంది దళ సభ్యులు లొంగిపోయారు. ఇదిలా ఉంటే.. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్ట్ రహిత భారత్‌కు కేంద్ర హోం శాఖ పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో గత నాలుగు నెలల్లో 100 మందికి పైగా మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌లలో భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఈ క్రమంలో తాము శాంతి చర్చలకు సిద్ధమని, అవసరమైతే కాల్పుల విరమణ పాటిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టులు ఓ లేఖ రాశారు.
