పాపం పాలపిట్ట | Telangana Government measures to save palapitta | Sakshi
Sakshi News home page

Palapitta Bird: పాపం పాలపిట్ట

Published Thu, Feb 27 2025 4:14 AM | Last Updated on Thu, Feb 27 2025 5:50 PM

Telangana Government measures to save  palapitta

కనిపించటమే గగనమైన ‘రాష్ట్ర పక్షి’

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో దసరా పండుగ పూర్తయ్యేది రంగురంగుల పాలపిట్టను దర్శించిన తర్వాతే. అందుకే అది రాష్ట్ర పక్షిగా కూడా అయ్యింది. అయితే, ఎంతో పవిత్రంగా భావించే పాలపిట్ట (Palapitta) ఈ మధ్య కనిపించటమే లేదు. దేశంలోని అంతరించిపోతున్న పక్షుల జాబితాలో పాలపిట్ట కూడా చేరిపోయింది. ‘రైతు నేస్తం’గా పిలిచే పాలపిట్ట పూర్తిగా అంతరించిపోకుండా కాపాడేందుకు తాజాగా ప్రభుత్వం నడుం బిగించింది.

ప్రమాదం అంచున..
ఆకర్షణీయమైన ప్రత్యేక రంగులతో ఇట్టే ఆకట్టుకునే రంగురంగుల పక్షి పాలపిట్ట. దీనిని ఇండియన్‌ రోలర్ (Indian roller), బ్లూ జే అని కూడా పిలుస్తారు. రెక్కలు విచ్చుకున్నప్పుడు ముదురు, లేత నీలం రంగు డామినేట్‌ చేస్తూ... తెలుపు, గోధుమ, నలుపు రంగులతో ఈ పక్షి ప్రత్యేకంగా కనిపిస్తుంది. మామూలు సమయంలో 30–34 సెం.మీ (12–13 అంగుళాలు), రెక్కలు విచ్చుకున్నప్పుడు 65–74 సెం.మీ (26–29 అంగుళాలు) పొడవు, 166–176 గ్రాముల బరువుతో చూడముచ్చటగా ఉంటుంది. 

ఏడాది క్రితం విడుదలైన ‘స్టేట్‌ ఆఫ్‌ ఇండియాస్‌ బర్డ్స్‌ రిపోర్ట్‌’లో సంఖ్య తగ్గిపోతున్న పక్షి జాతుల్లో వీటిని కూడా చేర్చారు. అంతకుముందు ఏడాదితో పోల్చితే వీటి సంఖ్య 30 శాతం తగ్గినట్లు వెల్లడైంది. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌) నివేదికలో రెడ్‌ లిస్ట్‌ రీఅసెస్‌మెంట్‌ కోసం పాలపిట్టను సిఫార్సు చేశారు. తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, ఒడిశా, బిహార్‌ (Bihar) రాష్ట్రాల్లో కూడా పాలపిట్టను రాష్ట్ర పక్షిగా గుర్తించారు. 

పాలపిట్ట పరిరక్షణకు ప్రణాళిక
పాలపిట్టల సంఖ్య తగ్గిపోవటానికి ప్రధాన కారణం గ్లోబల్‌ వార్మింగ్, కాలుష్యం, మొబైల్‌ టవర్ల ద్వారా వస్తున్న రేడియేషన్‌ (Radiation) అని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. దసరా, ఉగాది పండుగల సమయంలో కొందరు వీటిని బంధించి పట్టణాల్లో ప్రదర్శించి డబ్బులు వసూలు చేస్తుండడం కూడా వాటికి ప్రాణసంకటంగా మారుతోంది. ప్రమాదాన్ని గుర్తించిన ప్రభుత్వం పాలపిట్టను రక్షించేందుకు చర్యలకు ఉపక్రమించింది. 

చ‌ద‌వండి: హైద‌రాబాద్ జూ పార్కు ఎంట్రీ టికెట్‌ ధరల పెంపు

తాజాగా జరిగిన రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు సమావేశంలో పాలపిట్ట సంరక్షణకు ప్రణాళిక సిద్ధం చేయాలని అటవీ శాఖా మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. అటవీచట్టం షెడ్యూల్‌–4లో పాలపిట్ట ఉండడంతో దానిని బంధించడం, హింసించడం వంటివి చేస్తే నాన్‌బెయిలబుల్‌ కేసులతో పాటు మూడేళ్ల జైలుశిక్ష, రూ.25 వేల వరకు జరిమానా విధించే వీలుంది. దీంతో పాలపిట్ట సంరక్షణకు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

రైతు నేస్తం
పాలపిట్టలు రైతు నేస్తాలు. ఇవి వలస పక్షులు కావు. భారత్, ఇరాక్, థాయ్‌లాండ్‌లో అధికంగా కనిపిస్తాయి. చిన్న కప్పలు, మిడతలు, కీచురాళ్లు వంటి వాటిని వేటాడి తింటుంటాయి. వీటి జీవితకాలం 17–20 ఏళ్లు. చెట్ల తొర్రల్లో గూళ్లు పెట్టి మూడు నుంచి ఐదు గుడ్ల వరకు పెడతాయి. వీటి ప్రత్యుత్పత్తి కాలం వాటి ఆవాస ప్రాంతాలను బట్టి ఫిబ్రవరి–జూన్‌ నెలల మధ్యలో ఉంటుంది. ఈ పక్షులు పంట పొలాలు, తోటలు, ఉద్యా నవనాల్లో తెగుళ్లను ఆహారంగా తీసుకుంటాయి. పంటలను నష్టపరిచే కీటకాలు, సరీసృపాలు, ఉభయ చరాలను వేటాడి తింటూ రైతులకు పరోక్షంగా సహకారం అందిస్తాయి. అందుకే వీటిని రైతునేస్తాలు అని పిలుస్తారు.

పంటల సాగు తగ్గటంవల్లే..
కొంతకాలంగా పాలపిట్టలు అంతగా కనబడడం లేదు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ రియల్‌ ఎస్టేట్‌ విస్త రణ, నగరాలు, పట్టణాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయం నిలిచిపోవడంతో వాటి ఆవాస ప్రాంతాలకు ఇబ్బందులు తలెత్తాయి. పంటల రక్షణకు పురుగుమందులు అధికంగా వినియోగించటం కూడా ఈ పక్షుల సంఖ్య తగ్గటానికి కారణం. 
– హరికృష్ణ ఆడెపు, హైదరాబాద్‌ బర్డింగ్‌ పాల్స్‌ అధ్యక్షుడు.

పూర్తిగా అంతరించకపోవచ్చు..
పాలపిట్టలు మను షులు, జనావాసా లకు దూరంగా ఉండేందుకు ఇష్టపడతాయి. అందువల్ల వాటి కచ్చితమైన సంఖ్యను తెలుసుకో వడం కష్టమే. పాలపిట్ట జాతి పూర్తిగా అంతరించిపోతుందని భావించడానికి లేదు.  
– డా. సాయిలు గైని, బయో డైవర్సిటీ నిపుణుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement